రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులుతోపాటు గంటకు 40కి.మి వేగంతో వీచే ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం బుధవారం విదర్భ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 0.9 కి.మి ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వివరించింది.కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,
ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ ,హన్మకొండ, జనగాం, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి ,వికారాబాద్, సంగారెడ్డి ,మెదక్ ,మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబగద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. సిర్పూర్‌లో అత్యధికంగా 37.3 మి.మి వర్షం కురిసింది. కొనసమందర్‌లో 34, జంబుగలో 29.3, పెద్ద కొప్పగల్‌లో 27, జైనూర్‌లో 27, పోచారలో 26.8 మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనాలో 42.3డిగ్రీలు నమోదయ్యాయి.