అప్రమత్తమైన టిటిడి అధికారులు…
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమలలో మరో రెండు చిరుతలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల సంచారాన్ని అధికారులు గురువారం గుర్తించారు. ఇప్పటికే ఐదు చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంధించారు. తాజాగా మరో రెండు చిరుతలను గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రెండు చిరుతలను బంధించేందుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. తిరుమల నడక మార్గంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు భద్రత కల్పించడంపై టిటిడి దృష్టి కేంద్రీకరించింది. నడక మార్గం గుండా శ్రీవారి ఆలయానికి వస్తున్న భక్తులకు కర్రలను పంపిణీ చేస్తున్నారు. మరో వైపు చిరుతలను బంధించే ఏర్పాట్లు తీవ్రతరం చేశారు. ఈ ప్రాంతంలో చిరుతల సంఖ్య ఎందుకు పెరిగిందనే విషయమై ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 28న ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పులి చిక్కింది. వారం రోజుల పాటు ఈ చిరుత పులి ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. అంతకుముందు ఆగస్టు 17న లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. ఆగస్టు 14న అలిపిరి మెట్ల మార్గంలో మరో చిరుతను అధికారులు బంధించారు. అంతకు ముందే మరో చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. గురువారం మరో చిరుతను ఫారెస్ట్ అధికారులు బంధించారు. ఇదిలా ఉంటే గురువారం మరో రెండు చిరుతల సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ చిరుతల కదలికలను అటవీశాఖాధికారులు గుర్తించారు. ఈ రెండు చిరుతలను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలను షురూ చేశారు.