మాజీ ప్రధాని షేక్ హసీనాతోపాటు మాజీ మంత్రుల పై సోమవారం తాజాగా మరో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. కోటా వ్యతిరేక ఆందోళనలు చెలరేగిన సమయంలో ఈ హత్యలు జరిగాయని వేర్వేరుగా రెండు కేసులు దాఖలు అయ్యాయి. ఢాకా లోని మీర్‌పూర్ ఏరియాలో లిటన్ హసన్ లాలూ అలియాస్ హసన్ హత్యకు గురికాగా, లిటన్ సోదరుడు కేసును హసీనా పైన, మాజీ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్, మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ మమున్, మరికొందరిపైన ఢాకా కోర్టులో కేసు దాఖలు చేశారు. లిటన్ ఆగస్టు 4న మీర్‌పూర్ ఏరియాలో విద్యార్థుల శాంతియుత ప్రదర్శనలో పాల్గొనగా,
హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కాల్పులు జరిపిందని తీవ్రంగా గాయపడిన హసన్ తరువాత మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో కేసు షేర్ ఇ బంగ్లానగర్ ఏరియా నుంచి హతుడు తారిక్ హొస్సయిన్ తల్లి ఫిదుషీ ఖతూన్ కేసు దాఖలు చేసింది. హసీనాతోపాటు మాజీ రోడ్డు రవాణా మంత్రి ఒబైదుల్ ఖాదర్, మాజీ హోం మంత్రి కమల్, మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహముద్, రాష్ట్ర సమాచార మంత్రి మొహమ్మద్ అలీ అరాఫత్‌పై ఆమె కేసు దాఖలు చేశారు. ఆగస్టు 5న షేర్ ఇ బంగ్లానగర్ పోలీస్ స్టేషన్ ముందు కొందరు దుండగులు తారిక్‌పై కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆగస్టు 9న మృతి చెందాడని ఆమె కేసులో పేర్కొంది.