శ్రీనగర్ : అమర్‌నాధ్ యాత్రికుల్లో మరో ఇద్దరు మృతి చెందడంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 27కు చేరింది. అలాగే యాత్రకు బయలుదేరిన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిలో ఎనిమిది మంది గందర్‌బల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడడంతో శనివారం ఊర్మిలాబెన్ మోడీ (53) అనే యాత్రికురాలు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులను తరలిస్తున్న సమయంలో రెస్కూ బృందం లోని ఇద్దరు పోలీస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన పోలీస్ సిబ్బందిని, మరి కొందరిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఆర్మీ రంగం లోకి దిగింది. వారిని ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ద్వారా తరలించారు. మరోచోట రోడ్డు ప్రమాదంలో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఎనిమిది మంది గాయపడ్డారు. గందర్‌బల్ లోని బల్తాల్ ప్రాంతం నుంచి అమర్‌నాథ్ గుహ మందిరానికి వెళ్తుండగా, వీరి వాహనం రోడ్డుపై నుంచి అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.