Friday, December 20, 2024

కోటాలో మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోట (రాజస్థాన్ ): రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరు పొందిన కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా కోటాలో గంటల వ్యవధిలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులూ వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న 18 ఏళ్ల అవిష్కర్ శంభాజీ కస్తే, సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు. ఆదివారం కోచింగ్ సెంటర్‌లో పరీక్ష రాసిన తరువాత మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో అదే భవనం లోని ఆరో అంతస్తు నుంచి అవిష్కర్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఇనిస్టిట్యూట్ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సిసిటివి కెమెరాలో రికార్డు అయింది. పోలీస్‌ల వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాకు చెందిన అవిష్కర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే.

గత మూడేళ్లుగా తల్వాన్డీ ప్రాంతంలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి అద్దె గదిలో ఉంటూ నీట్ యాజీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బీహార్‌కు చెందిన ఆదర్శ్‌రాజ్ తన అద్దెగదిలో రాత్రి 7 గంటలకు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ఆదర్శ్‌రాజ్ కూడా పరీక్ష రాసిన తరువాత వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆదర్శ్ తన బంధువులతో కలిసి ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండేవాడు. ఉరి నుంచి కిందకు దించినప్పుడు కొన ఊపిరి ఉండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యం లోనే ప్రాణాలు విడిచాడు. మృతులిద్దరి వద్ద ఎలాంటి సుసైడ్ నోట్లు లేవని పోలీస్‌లు చెప్పారు. ఈ ఆత్మహత్యలపై దర్యాప్తు చేస్తున్నారు. వరుస విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలోవచ్చే రెండు నెలల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ ఓపి బంకర్ కోచింగ్ సెంటర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఇనిస్టిట్యూట్ లోని గదుల్లో ఫ్యాన్‌లకు యాంటీ సుసైడ్ డివైస్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

తల్లిదండ్రులపై రుణభారం.. విద్యార్థులపై మానసిక ఒత్తిడి
కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ , విద్యార్థుల చదువులకు తల్లిదండ్రులు చేసిన రుణాల భారమే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుండడానికి ఒక కారణమౌతోందని రాజస్థాన్ పబ్లిక్ హెల్త్ , ఇంజినీరింగ్ విభాగ మంత్రి మహేష్ జోషి పేర్కొన్నారు. జైపూర్ లోని విలేఖరులతో సోమవారం మాట్లాడుతూ ఈ మేరకు కేంద్రం కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాలని , దానివల్ల చదువుల కోసం తల్లిదండ్రులు రుణాలు చేయవలసిన అవసరం ఉండదని సూచించారు. తమ చదువుల కోసం తల్లిదండ్రులు భారీ మొత్తంలో రుణాలు చేసినందున తాము పరీక్షల్లో ఉత్తీర్ణత కాకుంటే తమ కుటుంబానికి ఏం జరుగుతుందని విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News