Monday, December 23, 2024

టిఎస్ ఆర్టీసికి రెండు జాతీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి)కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. రహదారి భద్రత కేటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్ ఆన్ ది రోడ్’ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) శనివారం ప్రకటించింది. కుషాయిగూడ డిపోకు చెందిన కె. రంగారెడ్డి, సూర్యాపేటకు డిపోకు చెందిన కె. సోమిరెడ్డిలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తమ సర్వీస్‌లో ప్రమాదరహితంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఈ పురస్కారాలు వారికి లభించాయి. పట్టణ, గ్రామీణ విభాగాల్లో ఈ అవార్డులను ఏఎస్‌ఆర్టీయూ ప్రకటించింది.

ఏప్రిల్ 18వ తేదీన విజేతలకు ఢిల్లీలో అవార్డులు…

ఈ అవార్డులను కేంద్ర రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్ 18వ తేదీన న్యూఢిల్లీలో విజేతలకు అందజేస్తారు. అవార్డులు వరించిన ఇద్దరు డ్రైవర్లు కె. రంగారెడ్డి, కె. సోమిరెడ్డిలకు సర్టిఫికెట్, నగదు పురస్కారంతో పాటు ట్రోఫీలను అందజేస్తారు. తమ సంస్థకు చెందిన ఇద్దరు డ్రైవర్లకు ఈ పురస్కారాలు లభించడంపై టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన కె. రంగారెడ్డి, కె. సోమిరెడ్డిలను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ పురస్కారాలు టిఎస్ ఆర్టీసి ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేశాయని వారు తెలిపారు. సంస్థలోని మిగతా డ్రైవర్లు కూడా వీరి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని వారు సూచించారు. ప్రస్తుతం డ్రైవింగ్ ఒక సవాల్‌గా మారిందని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని వారు సూచించారు.

ప్రతి డిపోలోనూ ప్రత్యేక అధికారి

రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనదారుల, పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ ప్రమాదాల నివారణకు పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలోనూ ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. ప్రతి ప్రమాదాన్ని లోతుగా అధ్యయనం చేసి, దానికి కారణాలు, నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని అద్దె బస్సు డ్రైవర్లకు వారంరోజుల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చామని వారు వివరించారు. రాబోయే రోజుల్లో రహదారి భద్రతపైన వినూత్నమైన కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుందని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News