సిటిబ్యూరోః మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో మరో ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఫుల్‌గా మద్యం తాగి కారు ప్రయాణిస్తున్న ప్రజాభవన్ వద్ద గత నెల 23వ తేదీన ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు సాహిల్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. అక్కడ నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని దుబాయ్ పారిపోయాడు. తన ప్లేస్‌లో కారు డ్రైవర్‌ను పంపించి తానే మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశానని పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేశాడు.
దీనిపై వెస్ట్‌జోన్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ దర్యాప్తు చేసి పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్ దుర్గారావు ప్రమేయం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నివేదిక ఇవ్వడంతో ఇన్స్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసులోనే సాహిల్ దుబాయ్‌కి పారిపోయేందుకు సహకరించిన వారిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇన్స్‌స్పెక్టర్ దుర్గారావు ఫోన్‌లో ఉన్న కాల్ రికార్డింగ్స్‌ను పరిశీలించిన పోలీసులు బోధన్ ఇన్స్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడిన రికార్డింగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా ఇన్స్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను ఆదివారం ఉదయం బోధన్‌లో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకుని వచ్చారు.