Thursday, January 9, 2025

మహబూబ్‌నగర్‌లో కల్తీకల్లు కల్లోలం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ ః మహబూబ్‌నగర్ పట్టణంలో కల్తీకల్లు కలకలం రేపుతోంది. పట్టణంలో కోయనగర్, దొడ్డలోని పల్లెతో పాటు పట్టణంలో మోతి నగర్ తదితర ప్రాంతాల నుంచి కల్తీకల్లు సేవించి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే కల్తీకల్లు వేటుకు ఇద్దరు బలి కాగా, మరి కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కల్తీకల్లు బాధితులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. అయితే కల్తీకల్లు బాధితుల వివరాలు బయటికి రాకుండా ఉండేందుకు అటు ఎక్సైజ్ శాఖ అధికారులు, ఇటు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది దోబూచులాట ఆడుతోంది. వివరాలను రహస్యంగా ఉంచడంపై పలు అనుమానాలుకు తావిస్తోంది.

మహబూబ్‌నగర్ పట్టణం మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గం కావడంతో ఎక్కడ కల్తీకల్లు బాధితుల విషయం మంత్రి దృష్టికి వెళ్తే తమపై చర్యలు ఉంటాయని భావించారో ఏమో బాధితుల వివరాలు బయటికి రానీయడం లేదు. ఇద్దరు మృతుల వివరాలు కూడా బయటికి రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కల్లు తాగి మరణిస్తే బీమా పాలసీలు రావని చెప్పి వడదెబ్బలు తగిలి చనిపోయినట్లు చెప్పాలని బాధిత కుటుంబ సభ్యులకు సూచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాఖ కావడంతో కల్తీకల్లు విషయం దుమారం రేగే అవకాశాలు ఉండడంతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తంగా ఉండాల్సింది పోయి నిర్లక్షంగా ఉండడంతోనే ఈ సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News