కత్తితో ఎస్సైపై దాడి
నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఆపుతుండగా దాడి చేసిన ఇద్దరు యువకులు
హైదరాబాద్: అర్ధరాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సైపై చిన్న కత్తితో దాడి చేసిన సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పైగా పనిచేస్తున్న వినయ్ కుమార్ మారేడుపల్లి ఓం శాంతి హోటల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు పవన్, సంజయ్ నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వస్తున్నారు. వారిని ఆపి ప్రశ్నిస్తుండగా ఎస్సై వినయ్‌కుమార్‌పై ఇద్దరు యువకులు ఒక్కసారిగా చిన్నకత్తితో కడుపులో పొడిచారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఎస్సైకు గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు లంగర్‌హౌస్‌కు చెందిన పవన్, బాలాజీనగర్‌కు చెందిన సంజయ్‌గా గుర్తించారు. వీరు గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఎస్సైపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.