Monday, December 23, 2024

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తండ్రి,కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

ఉర్కొండ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శనివారం నాగర్‌ కర్నూల్ జిల్లా ఉర్కొండ శివారులోని 167వ జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల మేరకు కల్వకుర్తి పట్టణానికి చెందిన టేకులపల్లి వెంకటయ్య తన ద్విచక్ర వాహనంపై భార్య పిల్లలతో కలిసి మండలంలో ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దైవ దర్శనానికి వెళ్లాడు. దర్శనం అనంతరం తిరిగి ద్విచక్ర వాహనంపై కల్వకుర్తి పట్టణానికి వెళ్తుండగా మండలంలోని 167 జాతీయ రహదారిపై గల పెట్రోల్ బంక్ సమీపంలో కల్వకుర్తి నుంచి అతివేగంగా వస్తున్న కారు లారీని ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది.

ఈ ఘటనలో టేకులపల్లి వెంకటయ్య(48), అతని కుమారుడు రాంచరణ్(4) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మృతుడి భార్య అనిత, కూతురు లిఖితలను స్థానికులు 108 సహాయంతో వైద్య చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతుడి భార్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వెల్దండ మండల శివారులోని ఏఎన్‌ఎమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.
మృతుని కుటుంబంలో విషాద ఛాయలు
దైవ దర్శనానికి వెళ్లి తండ్రి, కొడుకు మృత్యువాత పడ్డ ఘటన విన్న మృతుని బంధువులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శోకసంద్రంలో మునిగారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు ఒకేసారి మృతి చెందడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News