జగద్గిరిగుట్ట: ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మజ, బాలానగర్ జోన్ ఎసిపి పురుషోత్తం యాదవ్, జగద్గిరిగుట్ట సిఐ సైదులు, డిఐ మహేష్‌లు పాల్గొని నింధితుల వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా రాళ్ళపేట గ్రామానికి చెందిన చిత్తారి శ్రీను (25), నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ గ్రామానికి చెందిన నల్లబోతుల పరుశరామ్ అలియాస్ ప్రశాంత్ (28)తో కలిసి జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని షిర్డిహిల్స్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో జగద్గిరిగుట్ట ఔట్ పోస్ట్ చౌరస్తాలో డిఐ మహేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.
ద్విచక్రవాహనం (టిఎస్07 ఈటి 0893)పై వచ్చిన చిత్తారి శ్రీను, నల్లబోతుల పరుశరామ్‌లు పోలీసులను గమనించి పారిపోయారు. అనుమానంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. వారి దగ్గరి నుంచి 21 తులాల బంగారం, 80తులాల వెండి, ఒక ఎల్‌ఈడీ టీవి, హెచ్‌పి గ్యాస్ సిలిండర్, జీయో ఫోన్, మొత్తం రూ.12.25 లక్షల విలువైన సోత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే 2020 ఆగష్టులో కరీంనగర్ జైలు నుంచి చిత్తారి శ్రీను విడుదలయ్యాడు. జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, నాగర్‌కర్నూల్, గద్వాల్ పోలీస్‌స్టేషన్‌లలో వీరిపై కేసులు ఉన్నాయని, వీరిపై పిడియాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిసిపి పద్మజ తెలిపారు.