బిజ్నోర్ (యుపి): ఆరేళ్ల క్రితం బిజ్నోర్ జిల్లాలో సీనియర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారిని, ఆయన భార్యను కాల్చి చంపారన్న నేరం రుజువు కావడంతో నేరస్థులు ఇద్దరికి కోర్టు శనివారం మరణ శిక్ష విధించింది. అడిషనల్ జిల్లా జడ్జి విజయ్‌కుమార్ నేరస్థులు మునిర్, అతని సహచరుడు రేయన్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మిగతా ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టిందని బిజ్నోర్ ఎస్‌పి ధరమ్‌వీర్ సింగ్ చెప్పారు. 2016 ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఎన్‌ఐఎ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాంజిల్ అహ్మద్ , అతని భార్య ఫర్జానా పిల్లలతో కలిసి కారులో బిజ్నోర్ జిల్లా సయోహరాలోని ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దుండగులు కల్వర్టు దగ్గర ఆకస్మిక దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ హత్యాసంఘటన సంచలనం కలిగించింది. హత్య, తదితర నేరాలపై గుర్తుతెలియని వ్యక్తులపై దర్యాప్తు చేపట్టామని, తరువాత నిందితులు మునిర్, రేయన్, జైని, తంజిమ్ అహ్మద్, రిజ్వాన్ బయటపడ్డారని చెప్పారు. నిందితులు హతుల ఇరుగుపొరుగు వారేనని ఎస్‌పి పేర్కొన్నారు. జైనీ, తంజిమ్ అహ్మద్, రిజ్వాన్‌లను నిర్దోషులుగా కోర్టు విడిచిపెట్టగా, మునిర్, రేయన్ దోషులుగా తేలారని తెలిపారు. వీరిద్దరికీ మరణ శిక్ష విధించారు.