జార్ఖండ్ సిబిఐ కోర్టు తీర్పు
రాంచి: గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధన్‌బాద్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో శనివారం జార్ఖండ్‌లోని సిబిఐ కోర్టు ఒక ఆటో డ్రైవర్‌తో పాటుగా అతని సహచరుడికి మరణించేదాకా కఠిన జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది అడిషనల్ సెషన్స్ జడ్జిగా పని చేస్తున్న ఆనంద్ మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆటోరిక్షాతో ఢీకొట్టి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతని సహచరుడు రాహుల్ వర్మను హంతకులుగా నిర్ధారిస్తూ సిబిఐ కోర్టు జడ్జి రజనీకాంత్ పాఠక్ తీర్పు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు విచారణ ప్రాంభమయింది. విచారణ సందర్భంగా కోర్టు 58 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను నమోదు చేసింది. ధన్‌బాద్‌లోని రాధికా వర్మ చౌక్ వద్ద చాలా విశాలమైన రోడ్డుపై ఒక వైపు న్యాయమూర్తి జాగింగ్ చేస్తుండగా వేగంగా అతని వైపు దూసుకువచ్చిన ఆటోరిక్షా వెనుకవైపునుంచి అతడ్ని ఢీకొట్టి అక్కడినుంచి మాయమైనట్లు సిసిటీవీ కెమెరాలో రికార్డయింది.
మొదట ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. కాగా గత ఏడాది సుప్రీంకోర్టు సైతం జడ్జి హత్యను సుమోటోగా స్వీకరించి దీనిపై జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి, డిజిపిని స్థాయీ నివేదికను కోరింది. కాగా హత్య చేసిన సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో లేరని, ఉద్దేశపూర్వకంగానే వారు ఈ హత్య చేసినట్లు కోర్టు అభిప్రాయపడింని సిబిఐ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ జిందాల్ చెప్పారు. కాగా సిబిఐ హత్యపై కట్టు కథనాన్ని అల్లిందని నిందితుల తరఫు న్యాయవాది కుమార్ బిమెలెంద్ మీడియాతో అంటూ తీర్పును తన క్లయింట్లు పై కోర్టులో సవాలు చేయనున్నట్లు తెలిపారు.