జమ్మూ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన మారుమూల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల పోరులో ఇద్దరు సైనిక సిబ్బంది మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు శనివారం తెలిపారు.కోకెర్‌నాగ్ ప్రాంతంలోని అహ్లన్ గగర్‌నందు అడవులలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అడవిలో గాలింపు చేపట్టగా అడవిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు వారు చెప్పారు. ఉగ్రవాదుల కాల్పులలో ఐదుగురు సైనిక సిబ్బంది గాయపడ్డారని, వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారని వారు చెప్పారు. అటవీ ప్రాంతానికి వెంటనే అదనపు సైనిక బలగాలను తరలించినట్లు అధికారులు చెప్పారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక సిబ్బంది గాలింపును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.