Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి..

- Advertisement -
- Advertisement -

కీసరః కీసరలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కళాశాల విద్యార్ధులు మృతి చెందారు. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం… అల్వాల్ బొల్లారం, కార్ఖాన ప్రాంతాలకు చెందిన మల్యాల తుషార (18), భవేష్ రావు (17) శామీర్‌పేటలోని విశ్వ విశ్వాని కళాశాలలో బిబిఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం తరగతులు ముగిసిన తర్వాత తోటి మిత్రులు ఇంద్రకంటి హరిప్రియ, రూబెన్, ఫిలిప్ జాన్‌లతో కలిసి బెలెనో కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. అర్థరాత్రి 11.40 గంటలకు ఫిలిప్ జాన్ కారు నడుపుతుండగా విబిఐటి బొల్లారం నుండి బయలుదేరారు. కొంపల్లిలో మద్యం కొనుగోలు చేసి ఓఆర్‌ఆర్ సర్విస్ రోడ్డు గుండా శామీర్‌పేట నుంచి కీసర మండలం బోగారంలోని హోలీమేరి కళాశాల వరకు వెళ్లి వెనుదిరిగారు.

శనివారం తెల్లవారు జామున కారును అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో కీసరలోని లలిత కన్వెన్షన్ హాల్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారు వెనక సీటులో కూర్చున్న తుషార, భవేష్ రావు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. రూబెన్, పిలిప్ జాన్, హరిప్రియలకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంగాంధీ ఆసుపత్రికి తరలించారు. కారులో లభించిన మద్యం సీసాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతి చెందిన వారిలో తుషార్ తండ్రి చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా అల్వాల్ హిల్స్ కాలనీలో తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటుంది. భవేష్ రావు కార్ఖానలో నివాసం ఉంటున్న మాజీ సైనికుడి కుమారుడు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News