Friday, January 10, 2025

నల్గొండలో సంచలనం రేపిన ఇద్దరి అమ్మాయిల ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

నల్గొండ: గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇద్దరు డిగ్రీ విద్యార్థులు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన ఎనగతుల మనిషా (20) అదే మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన దంతరబోయిన శివాని (20) నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరూ నార్కట్ పల్లిలోని ఓ కాలేజ్‌లో కలిసి ఇంటర్ చదివారు. ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరు స్నేహితులు కాగా ఇద్దరికీ నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలోనే డిగ్రీ సీటు లభించడంతో అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ఇరువురు కలిసి నల్లగొండలోని ఓ హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే గత 20 రోజుల క్రితం ఇరువురు కలిసి హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

కళాశాలలో పరీక్షలు ఉండడంతో ఇరువురు కలిసి మంగళవారం ఇంటి వద్ద నుంచి నల్లగొండకు వచ్చారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల వెనకాల ఉన్న రాజీవ్ పార్క్ వద్దకు వెళ్లి ఇరువురు కలిసి గడ్డి మందు సేవించారు. పార్కు బయటకు వచ్చి ఇద్దరు స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతి చెందారు. ఉన్నత విద్యాభ్యాసం చదువుతున్న తమ పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారని ఆశించిన తరుణంలో ఆత్మహత్యకు పాల్పడడం ఆ కుటుంబాలను కలిచి వేసింది. కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

విద్యార్థినుల మృతిపై పలు అనుమానాలు…
డిగ్రీ విద్యార్థినిలు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనిషా, శివాని ఇద్దరు స్నేహితులుగా ఉండడంతో పాటు గత నాలుగేళ్లుగా ఒకే కళాశాలలో చదువుతూ అన్యోన్యంగా ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి ప్రణాళిక ప్రకారమే ఆత్మహత్య చేసుకునేందుకు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో కూడా ఇద్దరూ ముందస్తుగా గానే ఆత్మహత్య చేసుకునేందుకు వారి చాటింగ్ ద్వారా పోలీసులు గుర్తించారు. శివాని ఓ ఫర్టిలైజర్ షాపు వద్దకు వెళ్లి గడ్డి మందు ఇవ్వమని అడగగా అమ్మనని చెప్పడంతో మా అమ్మ ఇమ్మంటుందని మనిషా కు ఫోన్ చేసి తల్లి బిడ్డల్లాగా ఫోన్ మాట్లాడుకోవడంతో ఆ షాపు యజమాని నమ్మి మందు విక్రయించినట్లు తెలిసింది. చాటింగ్ లో కూడా తెల్లవారు జాముని ఇద్దరు మెసేజ్ చేసుకుని ఇంత పొద్దుగాల షాపులు తీయరు కదా అని ఆలోచించి షాపులు తీసిన తర్వాత మందు కొనుగోలు చేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు విద్యార్థినిలు మృతిపై పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నారు.

అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం : శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ నల్లగొండ
ఇద్దరు విద్యార్థినుల ఆత్మహాత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. చనిపోయిన అమ్మాయిల కుటుంబాలు షాక్‌కు గురైయ్యారు. అంత్యక్రియల తర్వాత విచారణ చేపడతాం. ప్రస్తుతానికైతే ఇన్‌స్ట్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వేధింపులు జరిగినట్లు ఊహాగానాలే తప్ప మా దృష్టికి రాలేదు. ఇద్దరు గత నాలుగైదేళ్లుగా మంచి స్నేహితులుగా ఉండి కలిసి చదువుకుంటున్నారు. వారు చదువుతున్న కాలేజీలో కూడా ఎలాంటి వేధింపులు జరగలేదు. ప్రస్తుతానికి వారి ఆత్మహాత్యకు తగిన కారణాలు తెల్వలేదు. బంధువులు, స్నేహితుల ద్వారా వివరాలు సేకరిస్తున్నాం. మొబైల్‌ను టెక్నికల్ అనాలసిస్ చేస్తున్నాం. పూర్తి స్థాయి విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని డిఎస్పి తెలిపారు. తల్లిదండ్రులు మాత్రం అనారోగ్యమనే చెబుతున్నారు. కానీ వారు కూడా ఆత్మహాత్యకు అనారోగ్యం కారణంగా భావించట్లేదని తెలిసింది. ఏదేమైనా పూర్తి స్థాయి విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News