Wednesday, January 22, 2025

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

పూంచ్ (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిద్దరూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒకరిని సెల్ఫ్ స్టైల్ డివిజినల్ కమాండర్ మునీర్ హుస్సేన్‌గా గుర్తించారు. మరొకరు అతడికి బాడీ గార్డుగా వచ్చిన వ్యక్తిగా నిర్ధారించారు. ఈ ఇద్దరూ డేగ్వార్ సెక్టార్ లోని సరిహద్దు రేఖ వద్ద సోమవారం తెల్లవారు జామున చొరబాటుకు ప్రయత్నించగా వారి ప్రయత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పూంచ్ జిల్లాలో తమ ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి విస్తరింప చేయడానికి వారు చేసే కుట్రలను భగ్నం చేసినట్టు అయింది. ఈ ఎన్‌కౌంటర్‌పై జమ్ముకు చెందిన పీఆర్‌వో లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్ట్‌వాల్ మాట్లాడుతూ గర్హీ బెటాలియన్ ప్రాంతంలో తెల్లవారు జామున 2 గంటలకు ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందం వీరిని గుర్తించి కాల్పులు జరపగా ఒకరు కుప్ప కూలారని, మరొకరు వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేశాడని చెప్పారు.

అతడిని భద్రతా బలగాలు వెంబడించి మట్టుబెట్టాయని తెలిపారు. పోలీస్ రికార్డుల ప్రకారం మృతుల్లో ఒకరు పూంచ్ లోని బాగిలడ్రా గ్రామానికి చెందిన హుస్సేన్‌గా గుర్తించామన్నారు. హుస్సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునీర్ హుస్సేన్ 1993లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆయుధాల వాడకంలో మూడేళ్లు శిక్షణ పొందాక తిరిగి వచ్చాడు. 1998 వరకు అనేక సార్లు భద్రతా బలగాలపై కాల్పులు జరిపే ఆపరేషన్ల వెనుక మాస్టర్ మైండ్‌గా వ్యవహరించాడు. హుస్సేన్‌కు ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన హిజ్బుల్ అగ్రనేత సయీద్ సలావుద్దీన్‌కు సన్నిహితుడైన మౌలానా దావూద్ కశ్మీరికి, హుస్సేన్ అత్యంత సన్నిహితుడు. “ జమ్ము కశ్మీర్ లోని సరిహద్దుల్లో ని రాజౌరీ, పూంచ్ జిల్లాలకు మాజీ ఉగ్రవాదులను పంపి హిజ్బుల్ కార్యకలాపాలు తిరిగి ముమ్మరం చేయాలన్న ఆలోచనతో హిజ్బుల్ గ్రూప్ ఉన్నతస్థాయి సమావేశం ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిందని, ఇందులో భాగంగానే హుస్సేన్‌ను, అతని బాడీగార్డును ఇటువైపు పంపించి ఉంటారని రక్షణశాఖ అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News