జమ్మూ కాశ్మీర్‌లో కథువా ఉధంపూర్ సరిహద్దు సమీపంలోని బసంత్‌గఢ్‌లో బుధవారం ఒక ఎన్‌కౌంటర్‌లో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతులయ్యారు. బుధవారం ఉదయం ఉధంపూర్ జిల్లాలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య తుపాకులతో పోరు మొదలైంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందడంతో పారామిలిటరీ దళాలు. పోలీస్ సిబ్బంది బసంత్‌గఢ్ చేరుకుని ఆ ప్రాంతంలో రక్షణ వలయంఏర్పాటు చేశారు.
భద్రత సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనితో భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. జమ్మూ అఖ్నూర్ సెక్టర్‌లో ఎల్‌ఒసి పొడుగునా ఎటువంటి కవ్వింపూ లేకుండా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు పూనుకున్న తరువాత సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్) జవాన్ ఒకరు గాయపడిన కొన్ని గంటలకే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పది సంవత్సరాల్లో మొదటి సారిగా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనుండగా చెదురుమదురుగా దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.