కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ఐదుగురు భద్రతీ సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదుల చొరబాటు బృందాన్ని మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు తమ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినప్పుడు ఇలా జరిగిందని గురువారం అధికారులు తెలిపారు. రాజ్‌బాగ్‌లోని ఘాటి జుతానా ప్రాంతంల్నో జఖోలే గ్రామం సమీపంలో జరిగి ఈ కాల్పుల్లో దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు.
కాల్పుల ఆరంభంలో ప్రత్యేక పోలీసు అధికారి భరత్ చలోత్రా ముఖానికి గాయాలయ్యాయి. జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది. కాగా, పోలీస్, సైనిక, సిఆర్‌పిఎఫ్ అదనపు బలగాలను వెంటనే ఆ ప్రాంతంలో మోహరించారు. ఉగ్రవాదులు శనివారం నాడు లోయ మార్గం ద్వారా లేదా సరిహద్దు ఆవల నుండి కొత్తగా నిర్మించిన సొరంగం ద్వారా చొరబడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలావుండగా డిజిపి నళిన్ ప్రభాత్, జమ్మూ జోన్ ఐజిపి భీమ్ సేన్ టుటి గత నాలుగు రోజులుగా కథువా నుండి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.