Friday, November 15, 2024

సహకార బ్యాంకు రంగంలో టు – టైర్ విధానం మేలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సహకార బ్యాంకు రంగంలో టు -టైర్ విధానం ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధుల సమావేశం ఆదివారం కోఠిలోని ఓ హోటల్ లో జరిగింది. ఈ సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో త్రీ – టైర్ విధానం అమలులో ఉందని, దీని వల్ల పరిపాలనా పరంగా, నిర్వహణ పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం త్రీ – టైర్ విధానంలో భాగంగా గ్రామాల స్థాయిలో ప్యాక్స్ చైర్మన్, జిల్లా స్థాయిలో డిసిసిబి చైర్మన్, రాష్ట్ర స్థాయిలో టేస్కాబ్ చైర్మన్ వ్యవస్థ అమలులో ఉందని వినోద్ కుమార్ తెలిపారు. టు – టైర్ విధానం అమలులోకి వస్తే గ్రామాల స్థాయిలో ప్యాక్స్ చైర్మన్ , రాష్ట్ర స్థాయిలో టేస్కాబ్ చైర్మన్ ఉంటారని, జిల్లా స్థాయిలో డైరెక్టర్ మాత్రమే రాష్ట్ర బ్యాంక్ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలలో సహకార బ్యాంకు డైరెక్టర్లు ఎంపిక అవుతారని వినోద్ కుమార్ వివరించారు. అయితే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ ) ప్రతిపాదన మేరకు దేశంలో 12 రాష్ట్రాలలో టు – టైర్ విధానం అమలు జరుగుతోందని వినోద్ కుమార్ అన్నారు.

అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు టు-టైర్ విధానం అమలులోకి తేవాలని ముక్తకంఠంతో చేసిన విజ్ఞప్తి మేరకు వినోద్ కుమార్ స్పందించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన విధాన పరమైన అంశం కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, సహకార ఉద్యమం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయనన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రవేట్ పరం చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలని వినోద్ కుమార్ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కు సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేట్ పర ఎత్తుగడలపై యూనివర్సిటీలలో, కాలేజీలలో, మేధావులతో సెమినార్లు నిర్వహించి చైతన్యం చేయాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు రవీంద్ర నాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాంబాబు, కార్యదర్శులు కృష్ణా రావు, ఉదయ్ కుమార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News