సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలుగడ్డ బావి వద్ద 2 స్పేర్ కోచ్‌లలో మంటలు చెలరేగాయి. వాటిలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ వాషింగ్ లైన్లో ప్యాంట్రీ కార్ అగ్ని ప్రమాదానికి గురైంది. కోచ్‌ను దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సందర్శించారు. సికింద్రాబాద్ కోచింగ్ డిపోకు సంబందించిన వాషింగ్ లైన్‌లో గురువారం ఉదయం సుమారు10.30 గంటలకు మెయింటెనెన్స్ కోసం నిలిచియున్న ప్యాంట్రీ కార్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. కోచ్ మెయింటెనెన్స్ సిబ్బంది కోచ్ నుండి పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సంబంధిత అధికారికి సమాచారం అందించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక అధికారులకు కూడా సమాచారం అందించారు.
స్టేషన్‌లోని రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేశారు. అదే సమయంలో, మంటలు ఇతర కోచ్ లకు వ్యాపించకుండా అగ్నికి గురైన కోచ్ ను ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఇతర కోచ్ల నుండి వేరు చేశారు. ఉదయం 11.30 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ వాషింగ్ లైన్‌లోని అగ్నికి గురైన ప్యాంట్రీ కార్ కోచ్ ను సందర్శించారు. తదుపరి అగ్నిప్రమాద సంఘటనకు సంబందించిన అంశాలపై సమీక్షించి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ జరిగిన సంఘటనపై జనరల్ మేనేజర్ వివరించారు.