కైరో: ఈజిప్టులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ ఈజిప్టులోని సోహగ్ రాష్ట్రంలో రెండు ప్యాసింజర్ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో 32 మంది చనిపోగా, మరో 66 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రైళ్లు ఢీకొనడంతో నాలుగు బోగీలు బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి 36 అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఖలీద్ మెజాహెద్ వెల్లడించారు. ఒక రైలును మరో రైలు వెనుకవైపునుంచి వేగంగా ఢీకొట్టడంతో ముందు రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.
బోగీలు పట్టాల పక్కన గుట్టగా పడి ఉన్న దృశ్యాలను, శిథిలాల మధ్య చిక్కుకు పోయిన ప్రయాణికుల దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. కొంత మంది బాధితులు స్పృహ కోల్పోయి ఉండగా, మరి కొందరు రక్తమోడుతున్న గాయాలతో బాధపడుతున్న దృశ్యాలు కూడా వాటిలో ఉన్నారు. స్థానికులు మృత దేహాలను మోసుకెళ్లి ప్రమాదం జరిగిన చోటుకు దగ్గర్లో నేలపై పడుకోబెడుతున్న హృదయవిదారక దృశ్యాలు కూడా వీటిలో ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్ సేస్ రైల్వే స్టేషన్‌లో ఇదే తరహాలో జరిఇగన ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.