న్యూఢిల్లీ : ఉత్తరకొరియాలో క్రైస్తవులు బైబిల్‌ను పట్టుకుంటే చాలు మరణశిక్ష విధిస్తున్నారని, పిల్లలతో సహా కుటుంబీకులకు శిక్ష తప్పడం లేదని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది. ఉత్తర కొరియాలో ఇతర మతాలకు చెందిన వారితోపాటు 70,000 మంది క్రైస్తవులను అరెస్టు చేసినట్టు ఆరోపించింది. ఇంటర్నేషనల్ రెలీజియస్ ఫ్రీడ్‌మ్ రిపోర్ట్ 2022లో ఈ ఘోరాలు వెల్లడయ్యాయి. బైబిల్‌తో కనిపించిన తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు , రెండేళ్ల బాలుడితోసహా యావజ్జీవ శిక్షకు గురైనట్టు , 2009లో మొత్తం ఆ కుటుంబాన్ని అరెస్టు చేసినట్టు ఆ నివేదిక ఆరోపించింది. ఈ విధంగా అరెస్ట్ అయిన క్రైస్తవులు ఆయా శిబిరాల్లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అమెరికా అరోపించింది.
ఈ విధంగా 90 శాతం వరకు ఉత్తర కొరియా వారిపట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని పేర్కొంది. ఉత్తర కొరియాలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా న్యాయం కోసం పనిచేస్తున్న కొరియా ఫ్యూచర్ అనే సంస్థ 2021 డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదికను ఈ సందర్భంగా ప్రస్తావించింది. మతపరమైన ఆచారాలు పాటించే వారిని, మతపరమైన వస్తువులు కలిగి ఉన్నవారిని ఉత్తర కొరియా ప్రభుత్వం హింసిస్తున్నట్టు ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నట్టు ఫ్రీడమ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇలాంటి దారుణాలు ఎదుర్కొన్న 151 మంది క్రైస్తవ మహిళల ఇంటర్వూల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.