బైక్‌లను కొట్టేసి వాటితో రీల్స్ చేస్తూ వాట్సాప్, ఇన్‌స్టాలో వీడియోలు పెడుతున్న ఇద్దరు నిందితులను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బాలుడు ఉన్నాడు, వారి వద్ద నుంచి తొమ్మింది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి రోహిణిప్రియదర్శిని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఇబ్రహిం, బాలుడు కలిసి పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బేగంపేటకు చెందిన స్మీత్ పటేల్ అనే వ్యక్తి ఇంటి వద్ద టివిఎస్ జూపిటర్ పార్కింగ్ చేసి కీస్‌ను దానికే పెట్టి మర్చిపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి బైక్ కన్పించలేదు. వెంటనే బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐసిసిసిలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో బైక్ షాహిన్ నగర్‌లో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిందితులు బైక్‌కు ఉన్న నంబర్ ప్లేట్‌ను తొలగించి తిరుగుతున్నారు. దానిని గుర్తించిన పోలీసులు బైక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితులు బైక్‌లపై ఉన్న మోజుతో కొట్టేసి వాటితో రీల్స్ చేస్తున్నారు. వీడియోలను వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రాంలో పోస్టింగ్ చేస్తున్నారు. నిందితులపై గతంలో సనత్ నగర్, ఎస్‌ఆర్ నగర్, హుమాయున్‌నగర్, రాంగోపాల్ పేట, ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డిఐ మల్లేశం, ఎస్సై గంగాధర్ కేసు దర్యాప్తు చేశారు.