సామాజిక మాధ్యమాల్లో సిఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన వీడియో పోస్టు చేసిన ఇద్దరు యూట్యూ బర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ అదనపు సిపి విశ్వప్రసాద్ మీడియాకు వెల్లడించారు. “నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్‌లో సిఎంను తిడుతున్న వీడియోను పోస్టు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ ఫిర్యాదు చేసినట్టు సీపీ వివరించారు. పల్స్ టివి పేరిట యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న రేవతి పేరుగల మహిళ ఒక వ్యక్తిని ఇంటర్వూ చేశారు. అందులో అతను సిఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య లు చేశారు.
సదరు మహిళా ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేయించినట్టు తమ దర్యాప్తులో గుర్తించినట్టు సీపీ పేర్కొన్నారు. ఈ వీడియోను ‘నిప్పుకోడి’ అనే ఎక్స్ హ్యాండిల్‌లో ట్రోల్ చేయడంపై తమకు అందిన ఫిర్యాదు మేరకు పల్స్ టివి చానెల్ సిఈఒ రేవతితో పాటు పల్స్ టివి ప్రతినిధి బండి సంధ్య అలి యాస్ తన్వి యాదవ్‌ను కూడా అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. పల్స్ యూట్యూబ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రెండు ల్యాప్ టాప్‌లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఒక లోగో, ఒక రూటర్, 7 సిపియూలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరిద్దరు ఎవరి నుంచి లబ్ధిపొందుతూ ఈ పని చేస్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఆ ఇద్దరికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
సిఎం ను కించపరిచేలా ఉన్న వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసిన యూట్యూబర్లు రేవతి, బండి సంధ్యకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిద్దరికీ ఈనెల 26 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ సందర్భంగా రేవతి రిమాండ్‌ను రిజక్ట్ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా, ఉద్దేశపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో లను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతారహిత్యంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వీరిపై చర్యలు తీసుకోవాల్సిందేనని వాదన లు వినిపించారు. పిపి వాదనలతో ఏకీభవించిన కోర్టు రేవతి, సంధ్య ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించగా వారిని జైలుకు తరలించారు.