Sunday, January 19, 2025

కోట్ల సంఖ్యలో పెరుగుతున్న టైప్ 2 డయాబెటిస్ కేసులు

- Advertisement -
- Advertisement -

డయాబెటిస్ (మధుమేహం) సర్వసాధారణ వ్యాధిగా మారి అత్యధిక శాతం మందిని పీడిస్తోంది. ఇది స్లో పాయిజన్ వంటిది. ఒకసారి సోకితే జీవితాంతం వెంటాడుతుంది. పూర్తిగా నివారణ కాకపోయినా అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్‌లో టైప్ 1,టైప్ 2 అనే రెండు రకాలు ఉన్నాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినా, లేదా సక్రమంగా లేక పోయినా, వంశపారంపర్యంగా నైనా టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. క్లోమగ్రంధి నుంచి ఇది ఉత్పత్తి అవుతుంది.

Also Read: నాణ్యత లేని ఆహారంతో 14 మిలియన్ టైప్2 డయాబెటిస్ కేసులు

రక్తం లోని చక్కెర స్థాయిలు నియంత్రించడానికి ఇన్సులిన్ అవసరం. చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే గుండె, కిడ్నీలు, నరాలు, కంటిసమస్యలు వస్తాయి. అందుకనే డయాబెటిస్ వచ్చిన తరువాత బాధపడే కన్నా అది రాకుండా ఉండడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ప్రపంచంలో టైప్ 2 డయాబెటిస్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. విటమిన్ డి లోపం ఉంటే టైప్ 2 డయాబెటిస్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. నాణ్యమైన ఆహారం తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ రాదని అంటున్నారు. అయితే ప్రపంచంలో ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ కేసులు 14.1 మిలియన్ వరకు పెరిగాయని అమెరికా లోని టఫ్ట్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

Also Read: పురుషుల్లో వ్యంధత్వానికి వీలు కల్పించే కొత్త జన్యువు

1990-2018 మధ్యకాలంలోనే ఇలా అమాంతంగా పెరిగాయని, ఇందులో 70 శాతం కొత్త కేసులు ఉన్నాయని వారు వివరించారు. మొత్తం 184 దేశాల్లో ఈ అధ్యయనం జరగ్గా, వీటిలో భారత్, నైజీరియా, ఇథియోపియా, వంటి అత్యధిక జనాభా కలిగిన 30 దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారం కారణంగా వచ్చే టైప్ 2 డయాబెటిస్ కేసులు తక్కువ సంఖ్యలో కనిపించాయని పరిశోధకులు విశ్లేషించారు. ఎటువంటి ఆహార కారకాల అంశాలు ప్రపంచ వ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తున్నాయో వీరు అధ్యయనంలో వివరించారు. ఈ మేరకు వీరు గుర్తించిన 11అంశాల్లో మూడు అంశాలు విపరీత వినియోగంతో కూడుకున్నవి. ఈ మూడు అంశాల కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుందని గ్రహించారు.

ఆహారం కారణంగా …
నాణ్యత లేని ఆహారం వల్లనే టైప్ 2 డయాబెటిస్ వస్తుందని తెలుసుకున్నాం కదా.. అయితే నాణ్యమైన ఆహారం ఏదని పరిశీలిస్తే తృణధాన్యాలను తగినంతగా తీసుకోవాలి. రిఫైండ్ బియ్యం, గోధుమలు మంచివి కావు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని అతిగా ఆరగించరాదు. ఫలరసాలు కూడా విశేషంగా తీసుకోకూడదు. కార్బొహైడ్రేట్లు అంటే పిండి పదార్ధాలు లేని కూరగాయలు, గింజలు, విత్తనాలు తగినంతగా తీసుకోకపోవడం కొత్త కేసుల్లో తక్కువ ప్రభావం చూపించాయి. ఏమాత్రం నాణ్యత లేని కార్బొహైడ్రేట్లు తీసుకోవడమే ఆహార సంబంధ పరంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తోందని పరిశోధకులు వివరించారు.

Also Read:  తల్లి మావి నుంచి శిశువుకు కరోనా వైరస్

దేశాల వారీగా, కాలాల వారీగా ఈ కేసుల్లో వైవిధ్యం కనిపిస్తోంది. ప్రాంతాల వారీగా చూస్తే సెంట్రల్, ఈస్టర్న్‌యూరప్, సెంట్రల్ ఆసియా ముఖ్యంగా పోలాండ్, రష్యా దేశాల్లో ప్రజలు ఎక్కువగా రెడ్‌మీట్ , ప్రాసెస్ చేసిన మాంసం, బంగాళా దుంపలు తీసుకుంటారు. లాటిన్ అమెరికా, కరిబియన్, ప్రత్యేకించి కొలంబియా, మెక్సికో దేశాల వారు సుగరీ డ్రింక్సు అత్యధికంగా సేవిస్తుంటారు. తృణధాన్యాలు చాలా తక్కువగా తీసుకుని ప్రాసెస్ చేసిన మాంసాన్ని విశేషంగా ఆరగిస్తారు. వీరందరికీ టైప్ 2 డయాబెటిస్ అత్యధిక శాతం ఉండడానికి ఇవే కారణాలు.

ఆహార ప్రభావం తక్కువగా ఉండే టైప్ 2 డయాబెటిస్ కేసులు దక్షిణాసియా, సబ్ సహరాన్ ఆఫ్రికా, దేశాల్లో కనిపిస్తున్నాయి. సబ్ సహరాన్ ఆఫ్రికాలో నాణ్యత లేని ఆహారం వల్ల టైప్ 2 డయాబెటిస్ కేసులు ఎక్కువయ్యాయి. నాణ్యమైన ఆహారం తీసుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే డయాబెటిస్ సంక్రమించదు. తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్లను సగానికి సగం తగ్గించుకోవడం , అదే సమయంలో ప్రొటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా డయాబెటిస్ చాలావరకు అదుపు లోకి వస్తుందని భారతీయ వైద్య పరిశోధన సంస్థ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News