అంధకారంలో 227 పట్టణాలు
నిర్వాసితులైన 3 లక్షల మంది
డినాగాట్ రాష్ట్రం నేలమట్టం
బొహోల్ ప్రావిన్సులో భారీ విధ్వంసం
మనీలా : ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుపాను బీభత్సం సృష్టించింది. ఇప్పటివరకు 137 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక సమాచారం. గంటకు 270 కిమీ వేగంతో పెనుగాలులు చెలరేగి యావత్ దేశాన్ని అంథకారంలో నెట్టింది. దాదాపు 227 నగరాలు, పట్టణాలు అంధకారం కాగా, కేవలం 21 ప్రాంతాల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మూడు ప్రాంతీయ విమానాశ్రయాలు విధ్వంసం అయ్యాయి. క్రిస్మస్ వేడుకలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రళయ బీభత్సం సంభవించడం 2013 నాటి తుపాను బీభత్సాన్ని గుర్తుకు తెచ్చింది. ఆ ఏడాది నవంబరులో సంభవించిన తుపాను బీభత్సానికి దాదాపు 6300 మంది ప్రాణాలు కోల్పోయారు. బొహోల్ ప్రావిన్స్ లో 10 మంది అదృశ్యమయ్యారని, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని గవర్నర్ ఆర్థర్ యాప్ వెల్లడించారు.
ఈ ప్రావిన్సు లోని మొత్తం 48 మంది మేయర్లలో 33 మంది మాత్రమే నష్టాల గురించి సమాచారం అందించారని, అందువల్ల నష్టాలు కానీ మృతుల సంఖ్య కానీ మరింత ఎక్కువగా ఉండవచ్చని చెప్పారు. 1.2 మిలియన్ మంది వరకు ఉన్న ఈ ప్రావిన్సులో భాదితులకు ఆహారం, మంచినీరు సత్వరం అందించాలని ఆయన మేయర్లను ఆదేశించారు. మిలిటరీ ఏరియల్ సర్వేలో ఆయన ప్రావిన్సులో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు. బొహోల్ ప్రావిన్స్‌లో నష్టం చాలా బారీగా ఉందన్నారు. బొహోల్ లోని నదీతీర పట్టణం లొబోక్‌లో ప్రజలు ఇళ్ల కప్పుల పైన చెట్ల పైన గడుపుతున్నారు. వారిని కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. డినాగాట్ రాష్ట్రం పూర్తిగా నేలమట్టమైందని డినాగాట్ ఐలాండ్ ప్రావిన్స్ గవర్నర్ బగాపు పేర్కొన్నారు.
అన్ని ఇళ్ల కప్పులు బాగా దెబ్బతిన్నాయని, కొన్ని ఇళ్ల కప్పులు గాలులకు ఎగిరిపోయాయని తెలిపారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. గురువారం , శుక్రవారం భారీ వర్షాలకు పెనుగాలులకు దాదాపు 7,80,000 మంది బాధితులయ్యారు. 3,00,000 మంది తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే శనివారం తుపాను బాధిత ప్రాంతాలను సందర్శించి బాధితులకు 40 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు. ఫిలిప్పీన్స్‌ను ఏటా 20 తుపాన్లు విద్వంసం సృష్టిస్తుంటాయి. ఇతర ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తుంటాయి.