Monday, December 23, 2024

నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్: తుది సమరానికి సిద్ధమైన భారత్, ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

బెనోని: ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో ఒక్క సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లోనే టీమిండియాకు కాస్త పోటీ ఎదురైంది. లీగ్ దశతో పాటు సూపర్6లో భారత్ అలవోక విజయాలను అందుకుంది.

ఒక్క ఓటమి కూడా చవిచూడకుండానే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి ఆరో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో రెండు సార్లు ఫైనల్‌లో భారత్ తలపడింది. రెండు సార్లు టీమిండియానే విజయం సాధించింది. ఈసారి కూడా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలువాలనే లక్ష్యంతో పోరుకు సిద్ధమైంది. అంతేగాక పాకిస్థాన్ తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ మాత్రమే వరుసగా రెండు సార్లు ప్రపంచకప్ ట్రోఫీని గెలిచింది. భారత్‌కు ఈసారి ఆ రికార్డును సమం చేసే అవకాశం దక్కింది.

వరుస విజయాలతో..
ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. సూపర్ సిక్స్‌లో కూడా అజేయంగా నిలిచింది. సెమీస్‌లో బలమైన సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉంది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్, అర్షిన్ కుల్‌కర్ణి, ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్, ప్రియాన్షు మోలియా, సచిన్ దాస్, వికెట్ కీపర్ అవనిష్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. ముషీర్ ఖాన్ ఇప్పటికే రెండు సెంచరీలతో సత్తా చాటాడు. ఉదయ్, సచిన్, ఆదర్శ్ తదితరులు కూడా అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. సౌమి పాండే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రాజ్ లింబాని, మురుగన అభిషేక్, అర్షిన్ కులకర్ణి, ప్రియాన్షులతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు ఆస్ట్రేలియా జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టులో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఓపెనర్లు హారి డిక్సన్, సామ్ కొన్స్‌టాస్, కెప్టెన్ హుగ్ విబ్గెన్, వికెట్ కీపర్ రియాన్ హిక్స్, ఓలివర్ పీక్, టామ్ క్యాంప్‌బెల్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. దీంతో ఫైనల్లో ఆస్ట్రేలియాకు కూడా గెలుపు అవకాశాలు సమంగానే ఉన్నాయని చెప్పాలి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News