పదిమంది అమాయకులు మరణించారు.
యుఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ పశ్చాత్తాపం
వాషింగ్టన్ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆగస్టు 29న జరిగిన డ్రోన్ దాడి విషాదకరమైన తప్పిదంగా అమెరికా ఆర్మీ పశ్చాత్తాపం పడింది. కాబూల్ విమానాశ్రయంపై ఐసిఎస్ దాడి చేయడానికి సిద్ధమౌతున్నట్టు యుఎస్ ఇంటెలిజెన్స్‌కు విశ్వసనీయమైన సమాచారం అందిందని, దాంతో అనుమానిత ఐసిఎస్ ఆపరేషన్ లక్షంగా జరిగిన డ్రోన్ దాడిలో పొరపాటున ఏడుగురు చిన్నారులతోసహా 10 మంది అఫ్గాన్ పౌరులు మరణించడం అత్యంత విషాదకరమని ఆర్మీ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కెన్నెత్ మెకెంజీ చెప్పారు. ఈ దాడిపై విచారణ జరిపిన తరువాత అమెరికా ఈ ప్రకటన చేసింది. ఈ ఘటపపై అక్కడి రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ తప్పిదాన్ని ఒప్పుకుని క్షమాపణలు చెబుతున్నామని, , దీని నుంచి తప్పనిసరిగా పాఠం నేర్చుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎలా పరిహారం అందించాలో అమెరికా ప్రభుత్వం అంచనా వేస్తున్నదని జనరల్ కెన్నెత్ మెకంజీ చెప్పారు. కాబూల్ విమానాశ్రయంపై ఐసిఎస్ దాడులకు సిద్ధమౌతున్న ప్రదేశాన్ని అమెరికా నిఘా గుర్తించింది. ఐసిఎస్ ఉపయోగిస్తున్న తెల్లటి టయోటా కరోలా కారులో పేలుడు పదార్ధాలు ఉన్నాయని అమెరికా అధికారులు భావించారని, ఆ కారును ఎనిమిది గంటల పాటు అమెరికా ట్రాక్ చేసిందని, నిర్ణయించిన ప్రదేశంలో దాన్ని టార్గెట్ చేసిందని కానీ ఆ వాహనం గురించి నిఘా నివేదిక తప్పుగా సమాచారం ఇచ్చిందని కెన్నెత్ ఆనాటి దాడి వివరాలను తెలియచేశారు.