వాషింగ్టన్: భారత్ విజయవంతమైన జి20 సదస్సును నిర్వహించేలా చూడడానికి అమెరికా కట్టుబడి ఉందని వైట్‌హౌస్ పేర్కొంది. ఢిల్లీలో ఈ నెల 9,10 తేదీల్లో జరిగే జి20 సదస్సులో పాల్గొనడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం బయలుదేరడానికి ముందు వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒక రోజు ముందే ఢిల్లీ చేరుకోనున్న బైడెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ‘ఈ ఏడాది జి20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మేము అభినందిస్తున్నాం.
భారత్ ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేలా చూడడంతో సాయమందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని వైట్‌హౌస్‌ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్‌పియరే తన రోజువారీ మీడియ సమావేశంలో చెప్పారు. సదస్సులో తమ ఉమ్మడి ప్రాధాన్యతలు నెరవేరేలా చూడాలన్న తమ కృతనిశ్చయాన్ని గత జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరువురు నేతలు వ్యక్తం చేశారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాని మోడీ, ఇతర నేతలతో కలిసి ఆ కృషిని కొనసాగించడానికి అధ్యక్షుడు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు.