ర్జెస్‌జో (కీవ్) : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఓడించడానికి ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహకరిస్తామని అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసి భరోసా ఇచ్చారు. రష్యా దాడులను ఎదుర్కోవడంలో వీరోచితంగా సాహసిస్తున్నారని ఉక్రెయిన్ ప్రజలను ప్రశంసించారు. మలిదపా యుద్ధానికి ఉక్రెయిన్‌కు కావలసిన సహాయాన్ని సమీక్షించేందుకు అమెరికా కాంగ్రెస్ చట్టసభ్యులు కీవ్‌లో శనివారం పర్యటించారు. ఈ ప్రతినిధుల బృందానికి స్పీకర్ నాన్సీ పెలోసి నాయకత్వం వహిస్తున్నారు. కాలిఫోర్నియా డెమొక్రాట్ అయిన పెలోసీతోపాటు మరో ఆరుగురు సభ్యులు శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని, ఇతర ఉన్నతాధికారులను కలుసుకుని మూడు గంటల పాటు చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా పోలండ్‌లో విలేఖరులతో ఆదివారం నాన్సీ పెలోసీ మాట్లాడారు. ఉక్రెయిన్ ప్రజలు తమను తాము రక్షించుకోవడాన్ని ప్రశంసిస్తూ సుదీర్ఘకాలం తాము సైనిక సాయంతోపాటు మానవ వనరులను, ఆర్థిక పరంగాను పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు.