రష్యా ప్రతిపక్షనాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగ నేపథ్యం
వాషింగ్టన్ : రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ (44)పై విషప్రయోగం చేయడం, ఆపై అరెస్టు చేయడం వంటి ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తూ ఏడుగురు రష్యా సీనియర్ అధికారులపై అమెరికా ప్రభుత్వం మంగళవారం ఆంక్షలు విధించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితులైన ఈ అధికారులపై బైడెన్ ప్రభుత్వం మొట్టమొదటి సారి ఆంక్షలను విధిస్తూ ప్రకటించింది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌కు చెందిన అధికారులు 2020 ఆగస్టు 20న ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగానికి ప్రయత్నించారని అమెరికా నిఘావ్యవస్థ కనుగొనగలిగిందని వైట్‌హౌస్ ప్రెస్ శెక్రటరీ జెన్‌సకి వెల్లడించారు.
ఎలాంటి రసాయన ఆయుధాన్ని నేరుగా వినియోగించినా అంతర్జాతీయ చట్టపర నిబంధనలను ఉల్లంఘించినట్టేనని, ఇది ఆ ప్రభుత్వబాధ్యతగా పరిగణింపబడుతుందని ఆమె చెప్పారు. తక్షణం అలెక్సీ నావల్ని బేషరతుగా విడుదల చేయాలని తాము రష్యా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. రష్యా ప్రతిపక్ష నాయకుడిపై దాడులు చేయడం, విదేశీ వ్యవహారాలను హ్యాక్ చేయడం, వంటి వాటిపై బైడెన్ ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యలివి అని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ ఆంక్షల వివరాలను ఐరోపా యూనియన్‌కు కూడా పంపినట్టు చెప్పారు. ఇదే విధమైన ఆంక్షలను ఐరోపా యూనియన్ రష్యాపై గత అక్టోబర్‌లో ఐరోపా యూనియన్ విధించింది.