ముంబై: దుబాయి వేదికగా త్వరలో జరిగే ఐపిఎల్ రెండో దశ మ్యాచ్లకు పరిమిత సంఖ్యలో అభిమానులకు అనుమతి ఇచ్చేందుకు యుఎఇ క్రికెట్ బోర్డు అంగీకరించినట్టు తెలిసింది. అయితే మ్యాచ్లకు హాజరయ్యే అభిమానులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి ఇస్తామనే షరతును విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో యుఎఇ వేదికగా ఐపిఎల్ మిగిలిన మ్యాచ్లను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లను చూసేందుకు అభిమానులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బిసిసిఐ ఉంది. దీని కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డును ఒప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదిలావుండగా ఐపిఎల్లో 50 శాతం మంది అభిమానులకు మ్యాచ్లను చూసేందుకు అనుమతి ఇస్తామని ఎమిరేట్స్ బోర్డు హామీ ఇచ్చింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే స్టేడియంలో ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా కిందటి సీజన్లో యుఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్లో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఈసారి మాత్రం సగం సామర్థంతో మ్యాచ్లను చూసేందుకు అనుమతి ఇవ్వాలని ఎమిరేట్స్ బోర్డు నిర్ణయించింది.
UAE Cricket Board to allow audience for IPL 2021