ఇటీవల భారతీయ 22 వ లా కమిషన్ రితు రాజ్ అవస్తి చైర్మన్ ఆధ్వర్యంలో మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి క్రోడీకరణకు సూచనలు, సలహాలు రీతిలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం భారతీయ సమాజాన్ని కోరడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగానే ఈ ఉమ్మడి పౌర స్మృతి క్రోడీ కరణ సాధ్యాసాధ్యాలు, తీసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారానికి సంబంధించిన అంశాలు అనేక కోణాల్లో బహిర్గతమయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నట్లు మనకు తెలుస్తున్నది.
ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన
ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని భారత దేశ రాజ్యాంగంలోని 4 వ భాగంలో, ఆదేశిక సూత్రాల్లో భాగంగా 44 వ ఆర్టికల్‌లో పొందుపరచడం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలు కేవలం ప్రభుత్వాలకి ఆదేశాలు మాత్రమే. కావున వీటి ఉల్లంఘన జరిగినప్పుడు ఉల్లంఘనకి వ్యతిరేకంగా మనం న్యాయ స్థానాలను ఆశ్రయించి పరిష్కారాన్ని పొందే వీలు లేకుండా పోయింది. కారణం ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం తమ సామార్థ్యాన్ని బట్టి అంటే ఆర్థిక, సామాజిక, మానవ, ఇతర వనరుల ఆధారంగా అవి లభించే తీరును మాత్రమే పరిగణనలోకి తీసుకొని వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ప్రభుత్వాలపై ఎటువంటి తప్పనిసరిగా ఆదేశిక సూత్రాలను అమలు చేయాలి అన్న నిబంధన లేదు.
దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఒకే రాజ్యాంగం, ఒకే ఇండియన్ పీనల్ కోడ్, ఒకే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఒకే కాంట్రాక్ట్ చట్టం ఇలా ముఖ్యమైన చట్టాలు అందరికీ ఒకే విధంగా అమలు అవుతున్నాయి. కానీ దేశంలో సివిల్ అంశాల్లో రెండు విభాగాలు ఉన్నాయి. అవి ఒకటి పబ్లిక్ లా దీనికి కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్ లాంటి చట్టాలు మన దేశంలో అందరికీ సమానంగా చట్టం అమలవుతుంది. కానీ మరొకటి పర్సనల్ లా. ఈ పర్సనల్ లా అనేది వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, ఆస్తి పంపకాలు వంటి విషయాల్లో అన్ని మతాలకు వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయలను బట్టి, వాళ్లు ఆచరించే విధంగా, వారికి అనుకూలంగా, ఎవరి చట్టాలు వారికే ఉన్నాయి. ఇలా ఉన్న చట్టాలను ఒకే చట్టంగా చేసి భారత దేశంలోని ప్రజలందరికీ మత రహితంగా, కుల రహితంగా ఒకే పర్సనల్ లా ను అమలు చేయడమే ఉమ్మడి పౌర స్మృతి.
రాజ్యాంగ రచనా కమిటీ అనేక చర్చలు జరిపారు. అయినా మెజారిటీ మద్దతు లభించలేదు. కారణం అప్పటికి మత విశ్వాసాలు ప్రజల్లో ఎక్కువగా ఉండటం, ప్రజల్లో అక్షరాస్యతా సైతం తక్కువగా ఉండడం, దీనికి తోడు దీన్ని వ్యతిరేకించే మైనారిటీ వాళ్ళు మద్దతు ఇవ్వకపోవడం వల్ల డా. బి.ఆర్. అంబేడ్కర్ ఈ ఉమ్మడి పౌర స్మృతి ఆవశ్యకతను వ్యక్తపరిచారు. అంతే కాకుండా భవిష్యత్‌లో మారుతున్న సమాజానికి అనుకూలంగా చట్టబద్ధం చేయాలని భావిస్తూ ఈ అంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు.
ఆదేశిక సూత్రాలు
ఆదేశిక సూత్రాలను గతంలో చట్టబద్ధం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ప్రాథమిక విద్యను ఆర్టికల్ 21 ఎ లో చేర్చడం కాని, ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలు రాజ్యాంగంలో 243 ఆర్టికల్ లో చేర్చడం కాని, ఆర్టికల్ 47 మద్యపాన నిషేధం కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధ్దం చేయడం ఇలా ఆదేశిక సూత్రాలను చట్టబద్ధం చేయడం జరిగింది. కావున ఉమ్మడి పౌరస్మృతిపై కూడా ఇలాంటి అడుగులే పడబోతున్నాయి అనుకోవచ్చు.
న్యాయ వ్యవస్థల అభిప్రాయం
నరసు అప్ప వెర్సెస్ బాంబే 1952 కేస్‌లో ఇద్దరు భార్యలను కలిగి ఉండటం కొట్టి వేసింది. షబానో బేగం కేస్ 1986లో సుప్రీంకోర్టు మెయింటనెన్సు ( భరణం) చెల్లింపులో హిందువులకి వర్తించే విధంగానే సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ని వర్తింప చేశారు. కారణం ముస్లిం చట్టం ప్రకారం వారికి ఇద్దత్ పీరియడ్‌లో మాత్రమే భరణం ఇవ్వాలి. ఇది ముస్లిం మహిళలకి నష్టం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి. అదే విధంగా షయారా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసులో ట్రిపుల్ తలాక్ అనేది దుర్మార్గమైన ఆచరణ అని కొట్టివేసింది. మహిళలకు ఆస్తిలో వాటా చట్టం 2005. ఇలా అనేక అంశాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు ఆదేశిక సూత్రాలవైపు మొగ్గు చూపాయి.
ఇది దేశానికి ఉపయోగకరమా!
ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, జపాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో మైనారిటీలు ఉన్నా ఉమ్మడి పౌర స్మృతినే అమలులో ఉన్నది. మన దేశంలో 110 కోట్ల మంది హిందువులు, 20 కోట్ల మంది ముస్లింలు, 4 కోట్ల మంది క్రిస్టియన్లు, ఇతర మైనారిటీ వర్గ ప్రజలు కూడా ఉన్నారు. మన దేశం లో మైనారిటీలు ఉన్నా కొన్ని అంశాల పట్ల వారి చట్టాలు లేదా ఆచారాలు మహిళలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నాయి. ఉమ్మడి పౌర స్మృతి అనేది కేవలం ఆయా మతాల్లో, కులాల్లో అసాంఘిక చర్యలను చెరిపేసే విధంగా ఉండాలి తప్ప అవసరం లేని విధానాలను మార్చే విధంగా ఉండకూడదు, వుంటే అంతర్గత అల్లర్లకి దారి తీస్తాయి. ఈ పర్సనల్ లా అనేది అన్ని మతాలకీ, కులాలకీ సంబంధించి వివాహ వయసు ఒకే విధంగా ఉండాలి. ఎందుకు అంటే హిందూ మతంలోని కొన్ని కులాలు చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు.
అదే విధంగా ముస్లిం మతంలో కూడా మహిళలకి చిన్న వయసు లోనే వివాహనికి వాళ్ళ షరియత్ చట్టంలో అవకాశం ఉంది. అంతే కాకుండా విడాకుల విషయంలో కూడా భారతీయులందరికీ ఒకే విధానాన్ని స్వాగత్తిస్తాం. భరణం విషయంలో అందరికీ సమాన న్యాయం అందే విషయం కూడా ఆమోదయోగ్యమైన అంశం. ఆస్తిలో అందరికీ సమాన వాటాఅనేది అన్ని కులాలు, అన్ని మతస్థుల వారికి శుభ సూచికం. కానీ పెళ్లి ఎలా జరగాలి అంటే ఆచార వ్యవహారం అనేది మాత్రం ఎవరి ఆచారాలకి, సాంప్రదాయాలకి అనుగుణంగా తమతమ మత, కులాల ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే లేకుంటే ఆయా వర్గ ప్రజల వ్యతిరేక భావజాలం వెల్లివిరిసే ప్రమాదం ఉంది. మన రాజ్యాంగం ఆర్టికల్ 25 నుండి 28 వరకు మతపరమైన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ, అదే విధంగా ఆర్టికల్ 29 మైనారిటీలకు రక్షణ ఇచ్చినప్పటికీ అందులో ఉన్న సామాజిక రుగ్మతలను (అనవసరమైన ఆచారాలను) నిషేధించడం మానవ హక్కుల (హ్యూమన్ రైట్స్)కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అవసరంగా భావించాలి. దీని ద్వారా ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం మరింత చేకూరుతుంది.
తద్వారా భవిష్యత్తులో అంతా ఒకటే అన్నభావన వస్తుంది. అంతే కాకుండా ఒకే దేశం, ఒకే చట్టం అనే నినాదం పర్సనల్ చట్టాలకి కూడా వర్తించడం వల్ల భిన్నత్వంలో ఏకత్వం ఇంకా బలపడే అవకాశం ఉంది. కావున వివాహం జరగడంలో కొన్ని మినహాయింపులు ఇచ్చి ఎవరి మత, కుల సాంప్రదాయలకు స్వేచ్ఛను కల్పిస్తే మిగతా అన్ని విషయాల్లో అందరికీ మంచి జరుగుతుంది. ఒకే రాజ్యాంగం, ఒకే పీనల్ కోడ్, ఒకే క్రిమినల్ కోడ్ అన్ని మతాలకి, కులాలకి వర్తిస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రస్తుత సమాజ మార్పులకి అనుగుణంగా, మంచి పరిణామంగా భావించవచ్చు.రాజ్యాంగం ప్రభుత్వాలకి ఇచ్చిన ఆదేశిక సూత్రాలను, అందులో భాగంగా ఉన్న ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 44ను చట్టబద్ధం చేయడం పైన పేర్కొన్న కొన్ని మినహాయింపులతో స్వాగతించవచ్చు.
గోవింద్ గద్వాల్- 9392094078