జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాశవికంగా వ్యవహరించిన నిందితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. వీరిని శనివారం పోలీసులు కోర్టులో హాజరుపరిచిన క్రమంలో కోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున గుమికూడిన జనం వారిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తు చేస్తోంది. దానిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను అధికారులు జైపూర్ లోని ఎన్‌ఐఎ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిందితులను కోర్టులోపలినుంచి బయటికి తీసుకువచ్చే సమయంలో అక్కడే గుమికూడిన ప్రజలు వారిపై దాడి చేశారు. న్యాయవాదులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కన్హయ్య హంతకులకు మరణ శిక్ష విధించండి’, ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. దాడిలో నిందితుల్లో ఒకరి చొక్కా చిరిగిపోయింది. అతికష్టం మీద పోలీసులు వారిని అక్కడే వేచి ఉన్న ఖైదీలను తరలించే వాహనంతో అక్కడినుంచి తీసుకెళ్లారు. కాగా కోర్టు నిందితులను ఈ నెల 12 వరకు ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగించింది.