Tuesday, December 24, 2024

రాజస్తాన్ దర్జీ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Tailor murdered in Udaipur after support Nupur Sharma

నోటి దూల మాటలు ఎలాంటి పరిణామాలు పర్యవసానాలకు దారి తీస్తాయోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాజస్తాన్‌లోని ఉదయపూర్ పట్టణంలో దుండగులు కనయలాల్ అనే వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ దారుణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే, నిరసించాల్సిందే.మరొక మాట ఉండకూడదు. కాంగ్రెస్ నేతలు, కేరళ సిఎం పినరయి విజయన్, అనేక ముస్లిం సంస్థలు, ప్రముఖులు ఖండించారు. బిజెపి సరేసరి. ఇలాంటివి పునరావృతం కాకూడదని అందరం కోరుకుందాం. కోరుకుంటే చాలదు, అంతటితోనే ఆగకూడని పరిస్థితిని దేశంలోని మెజారిటీ, మైనారిటీ మతోన్మాదులు కల్పించారు గనుక ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో, ఎలా నివారించాలో ఆలోచించాల్సిన అవసరం లేదా! ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు! గతంలో కొన్ని పార్టీలు మైనారిటీల సంతుష్ట రాజకీయాలు చేసినట్లు ఆరోపించిన వారు ఇప్పుడు మెజారిటీ సంతుష్టీకరణలో పీకల్లోతులో మునిగి ఉన్నారు.

ఈ దారుణంలో ఎవరి వాటా పాత్ర ఎంత? కనయలాల్‌ను చంపినవారు తమ గురించి సచిత్రంగా, స్వయం గా ప్రకటించుకున్నారు. వారు చేసిన దారుణంతో మరోసారి యావత్ ముస్లిం సమాజం మీద ధ్వజం, విద్వేషాన్ని వెదజల్లేందుకు అవకాశం ఇచ్చారు. దర్జీ లేదా టైలర్ హత్య అన్నశీర్షికతో వార్తలు ఇచ్చిన మీడియా మీద మతశక్తులు ధ్వజమెత్తుతున్నా యి. వాటికి ఆగ్రహం ఎందుకు? ఒక హిందువును హతమార్చిన ముస్లింలు అని పెద్దక్షరాల్లో పతాక శీర్షికలు పెడితే తప్ప వారు శాంతించేట్లు లేరు. రేటింగులు, వాటితో వచ్చే లాభాల కోసం కొన్ని సంస్థలు మినహా మొత్తంగా మీడియా ఇప్పటికే విలువల వలువలను తొలగించుకుంది. గోచిపాతలతో ఉంది. హిజాబ్‌ను వద్దంటున్న మతశక్తులు వాటిని కూడా సహించేట్లు లేవు. వారు కోరుకున్న విధంగా శీర్షికలుపెట్టే రోజులు దగ్గరపడుతున్నట్లుగా ఉంది. చూద్దాం, కానున్నది కాక మానదు, రానున్నది రాకమానదు కదా!

కనయలాల్ ఒక మామూలు దర్జీ. కరోనా మాదిరి కాషాయ వైరస్ సోకిన వారిలో ఒకడు, కనుకనే ఆ ప్రభావంతో నోటి దూల నూపుర్ శర్మను అనుసరించి సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు, షేర్ చేశాడు. నూపుర్ శర్మ నోటి దూలను చర్చ నిర్వహించిన టివి ఛానల్ నివారించలేదు, రేటింగ్‌ల కోసం కొనసాగించి ఉండాలి. ఆమె మాటలను బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా దూల మాటలని ఖండించటమే కాదు, తాత్కాలికంగా పార్టీ నుంచి పక్కనపెట్టారు. ఆమె కూడా తన మాటలను వెనక్కు తీసుకున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంత జరిగాక కందకులేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లుగా కనయలాల్ వంటి వారు ఎందుకు గోక్కుంటున్నట్లు? మతశక్తులు విద్వేషాన్ని సామాన్యుల్లో ఎక్కించిన ఫలితం కాదా? నూపుర్ శర్మ నోటి దూల మాటలను సామాజిక మాధ్యమంలో సమర్ధించినందుకు (షేర్ చేసినందుకు) అతని మీద కేసు నమోదైంది.

అరెస్టు చేశారు. చిత్రం ఏమిటంటే అసలు సూత్రధారి, పాత్రధారి నూపుర్ శర్మ మీద కేసులు నమోదైనా అమిత్ షా శిష్యురాలు గనుక అరెస్టులు లేవు, పోలీసు కాపలాతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటున్నారు. మత మనోభావాలను కించపరిచినందుకు గాను కనయలాల్ జూన్ పదిన అరెస్టుకాగా మరుసటి రోజే కోర్టు బెయిలు మంజూరు చేసింది. అలాంటి పనులు చేసి దర్జాగా తిరగటం ఎంత సులభమో కదా! తరువాత తనను చంపేస్తామంటూ బెదరింపులు వస్తున్నట్లు, రక్షణ కావాలని పదిహేనవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత పోలీసు స్టేషన్ అధికారి రెండు సామాజిక తరగతులకు చెందిన వారిని పిలిపించి కూర్చో పెట్టి చర్చించిన తరువాత ఎవరి మీద చర్య తీసుకోనవసరం లేదని కనయలాల్ రాసి ఇచ్చినందున బెదిరింపుల గురించి పోలీసులు అంతటితో వదలివేశారు.

అనుమానితుల జాబితాలో హంతకులు ఉన్నట్లు పోలీసులకు చెప్పలేదు. హత్యకు ముందు తన దుకాణానికి వచ్చిన దుండగుల గురించి హతుడికి ఎలాంటి అనుమానం లేనందున అందరి మాదిరి కొలతలు తీసుకొనేందుకు ఉపక్రమించినట్లు కనిపిస్తున్నది.నిజంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే అతను కొద్ది రోజులు దుకాణాన్ని కూడా మూతపెట్టి ఉండేవాడు లేదా నూపుర్ శర్మ, పార్టీ బిజెపి నేతలను సంప్రదించి ఉండేవాడు. ఏదిఏమైనా జరిగింది దారుణం. పర్యవసానాలను ఊహించి ఉంటే తన ప్రాణం మీదకు తెచ్చుకొనేవాడే కాదు. కనుక విద్వేషాన్ని రెచ్చగొట్టే వాట్సప్ సందేశాలను, సోషల్ మీడియా పోస్టులను పది మందికి పంచే ఘనమైన పనులకు స్వస్తి పలకటం మంచిదని ఈ ఉదంతం కొందరికైనా కనువిప్పు కలిగిస్తుందా! దర్జీ దారుణ హత్య ఉదంతం గురించి, అంతకు ముందు నూపుర్ శర్మ మాటల గురించి కొన్ని టివి ఛానళ్లు చర్చలు నిర్వహించాయి. వాటిలో పాల్గొన్న సంఘ్ పరివార్‌కు చెందిన బిజెపి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంస్థల ప్రతినిధులెవరూ నూపుర్ శర్మ నోటి దూలను ఖండించకపోగా పరోక్షంగా సమర్ధించారు. మహమ్మద్ ప్రవక్త మీద కొందరు ముస్లింలే గతం లో మాట్లాడారని, నూపుర్ శర్మ వాటిని తిరిగి చెప్పారు తప్ప వేరు కాదని వాదించటమే కాదు, వాటి గురించి ముస్లిం పెద్దలు ఎందుకు నోరు విప్పటం లేదంటూ అడ్డుసవాళ్లు విసురుతున్నారు. అలాంటి చర్చలను చూసిన తరువాత కనయలాల్ వంటి వారికి అందునా బిజెపి బలంగా ఉన్న రాజస్తాన్‌లో మరింత ప్రోత్సాహం కలగదా?

కనయలాల్ హత్య మొత్తం హిందువుల మీదనే జరిగిన దారుణంగా కొందరు చిత్రిస్తున్నారు. అదే ప్రమాణాన్ని వర్తింప చేస్తే నూపుర్ శర్మ నోటి దూల తమందరికీ ఉన్నట్లు హిందువులు అంగీకరిస్తారా? కర్ణాటకలో సాహితీవేత్త కులుబుర్గి, జర్నలిస్టు గౌరీ లంకేష్, మహారాష్ర్టలో గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ను హత్య చేశారు. వారంతా పుట్టుకతో హిందువులే, వారిని హతమార్చిందెవరు? హంతకులకు వారితో ఎలాంటి పాతకక్షలు లేవు. విమర్శనాత్మక, భిన్నాభిప్రాయాన్ని సహించలేని కాషాయతాలిబాన్ల పనే కదా! కనయలాల్ హంతకులను ఎన్‌కౌంటర్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అనేక ఉదంతాలలో క్షణిక ఆవేశంలో బాధితుల కుటుంబాలు అలాంటి డిమాండ్లు చేస్తుండవచ్చు.

అది చట్టబద్ధం కాదు. ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక చోట్ల బూటకపు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లను ముందుకు తెస్తున్న నేపధ్యం ఇలాంటి చట్టబద్ధంగాని డిమాండ్లను ముందుకు తేవటంలో ఆశ్చర్యంలేదు. మరి పై నలుగురి కేసుల్లో , ఇతర సామూహిక దాడుల కేసుల్లో హంతకుల మీద కొన్ని సంస్థలు అలాంటి డిమాండ్‌ను ముందుకు తేలేదేం? ఉదయపూర్ దారుణానికి పాల్పడిన వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు. నిజాల నిగ్గు తేల్చటానికి ఎవరు వద్దన్నారు. వారు నరేంద్ర మోడీని చంపివేస్తామంటే వారినెవరన్నా సమర్ధించారా? గత గుజరాత్ ఎన్నికలపుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని ఏకంగా నరేంద్ర మోడీ చెప్పారు. తరువాత అదేమైంది, వాస్తవమా కాదా, ఎన్నికల్లో ఓట్ల కోసం అలా చెప్పారా? ఏం జరిగిందో చెప్పేవారు లేరు. కనయలాల్‌కు రక్షణ కల్పించటంలో రాజస్తాన్ రాష్ర్ట ప్రభుత్వం విఫలమైనట్లు బిజెపి చెబుతోంది. దుండగులు విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారని చెబుతున్నారు గనుక కేంద్ర నిఘా సంస్థలేమి చేస్తున్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి? కనయలాల్ హత్యను సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టటం జనాలను భయపెట్టేందుకే అన్నది స్పష్టం. ప్రపంచమంతటా ఉగ్రవాదులు చేస్తున్నపనే అది. మధ్యప్రదేశ్‌లో భవర్‌లాల్ జైన్ అనే 65 ఏండ్ల మతి స్థిమితం సరిగా లేని వృద్ధుడు ఒక వివాహానికి వెళ్లి వస్తూ దారి తప్పాడు. మూడు రోజుల తరువాత అతను శవమై కనిపించాడు. తరువాత సామాజిక మాధ్యమంలో ఒక వీడియో వైరలైంది. దానిలో దినేష్ కుష్వహా అనే బిజెపి కార్యకర్త ఆ వృద్ధుడిని కొడుతూ నీ పేరేమిటి, మహమ్మదేనా, ఆధార్‌కార్డుందా అని ప్రశ్నించినట్లుంది. భవర్‌లాల్ జైన్‌ది ప్రాణం కాదా? దాన్ని తీసిన వారి గురించి కాషాయ దళాలు మాట్లాడలేదేం? ఎన్‌కౌంటర్‌కు డిమాండ్ లేదు.

బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే దుండగులు రెచ్చిపోతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పాలన, లక్షలాది మంది మిలిటరీ, పారామిలిటరీ ఉన్న జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అక్కడ స్థానిక, కేంద్ర నిఘా సంస్థలు అడుగడుగునా ఉంటాయి. బతకటానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను, కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు హతమారుస్తున్నారు. దీనికి బిజెపి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్లా? ఉగ్రవాదులను ఎందుకు కనుగొనలేకపోతున్నారు, దాడులను ఎందుకు పసిగట్టలేకపోతున్నారు?ఉదయపూర్ దారుణానికి నూపుర్ శర్మ మాటలకు సంబంధం లేదని, ఉగ్రవాదుల కుట్రలు నిరంతరం జరుగుతున్నాయంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాంటి ఉగ్రదాడులు ఇప్పుడు జరుగుతున్నది నరేంద్ర మోడీ ఏలుబడిలోని కశ్మీరులో మాత్రమే. కనయలాల్ వలస కార్మికుడు లేదా కశ్మీరీ పండిట్ కాదు, కశ్మీరు నివాసీ కాదు. ఉగ్రవాదులు అతన్నే ఎందుకు బలితీసుకున్నట్లు?

దుండగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని చెబుతున్నారు. నిజమే, గర్హనీయమే, తీవ్రంగా ఖండించాల్సిందే. రాయిటర్స్ వార్తా సంస్థ, వికీపీడియా క్రోడీకరించిన సమాచార విశ్లేషణ ప్రకారం గో రక్షణ దళాల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారు 49 మందిని చంపివేశారు, 156 మంది గాయపడ్డారు. దాడులలో మూడు మినహా మిగిలినవన్నీ పద్మశ్రీ కంగనా రనౌత్ చెప్పినట్లు అసలైన స్వాతంత్య్రం వచ్చిన 2014 నుంచి జరిగినవే. మరి ఈ దారుణాల సంగతేమిటి? గో రక్షణ దళాల్లో ఎనభై శాతం నకిలీ అని నరేంద్ర మోడీ చెప్పారు. వారిలో ఎందరిని శిక్షించారు? దేశంలో నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితికి ఇవన్నీ నిదర్శనం. ఇక విద్వేష ప్రచారం గురించి చెప్పనవసరం లేదు. ముస్లింలను చంపమని, మహిళల మానమర్యాదలను మంటకలపాలని బహిరంగంగా పిలుపులు ఇచ్చినవారు స్వేచ్ఛ గా తిరుగుతున్నారు. వారి వీడియోలు అందరికీ అందుబాటలో ఉన్నాయి. ఉదయపూర్ ఉదంతానికి వీటన్నింటితో పరోక్ష సంబంధం లేదా? కనయలాల్ హంతకులు మహమ్మద్ రియాజ్, గౌస్ మహమ్మద్. వారి వెనుక ఉన్నది విదేశీ ఉగ్రవాదహస్తం, పథకమూ కావచ్చు. కానీ దానికి అవకాశం ఇచ్చింది బిజెపి నేత నూపుర్ శర్మ నోటి దూల కాదా!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News