ముంబయి: దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఇఓ ఉదయ్ కోటక్ తన పదవికి రాజీనామా చేశారు. సిఇఓ , మేనేజింగ్ డైరెక్టర్ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ చివరికి ముగియనుంది. ఇంతలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాకు సంబంధించిన లేఖను ఉదయ్ కోటక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘వ్యవస్థాపకుడిగా నేను కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నాను. సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్యమైన వాటాదారుగా సేవలను కొనసాగిస్తాను.
వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ నిర్వహణ బృందం ఉంది. వ్యవస్థాపకులు వెళ్లిపోయినా.. సంస్థ శాశ్వతంగా ముందుకు కొనసాగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. జేపీ మోర్గాన్, గోల్డ్‌న్ సాక్స్ వంటి సంస్థలు ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించటం చూశానని ఆయన తెలిపారు.దేశంలో గొప్ప ఆర్థిక సంస్థను సృష్టించాలనే కలతోనే తాను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో తాను ఈ సంస్థను ప్రారంభించినట్లు ఉదయ్ కోటక్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.