బిజెపికి సంజయ్ రౌత్ సవాల్
ముంబై: మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగిన పక్షంలో 100కు పైగా అసెంబ్లీ స్థానాలను ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన గెలుచుకుంటుందని శివసేన ఎంపి సంజయ్ రౌత్ మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. ధన బలంతోనో లేక కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చో శివసేనను హైజాక్ చేయలేరని బిజెపిని, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేని పరోక్షంగా ఆయన విమర్శించారు. ఒక ఎమ్మెల్యే పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు కాదని విలేకరులతో మాట్లాడుతూ రౌత్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే బిజెపి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఆయన సవాలు చేశారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌పై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనే అసలుదని, పార్టీ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకున్న పక్షంలో స్పీకర్ తన లా డిగ్రీని వాపసు చేయాలని రౌత్ సవాలు చేశారు.