ముంబయి: బిజెపికి బి-టీమ్‌గా ఉన్న ఆల్ ఇండియా మజ్లీస్‌ఎఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) కూటమి ఆఫర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదివారం తిరస్కరించారు. మహావికాస్ అఘడి(ఎంవిఎ)కి నేతృత్వం వహిస్తున్న శివసేనను అపఖ్యాతిపాలు చేసేందుకు వేసిన ఓ ఎత్తుగడ అన్నారు. తన పార్టీని ‘జనాబ్ సేన’ అని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి అభివర్ణించడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరుకు ఖాన్ లేక జనాబ్ తగిలిస్తే ఎలావుంటుందన్నారు. ముస్లింలపట్ల ఆర్‌ఎస్‌ఎస్, బిజెపికి ఉన్న ప్రేమను బట్టబయలు చేయాలన్నారు. ‘బిజెపి హిందుత్వ కేవలం ఓ భ్రమ అని ప్రజలకు తెలపాలి…ఎవరి పాలనా కాలంలో ఎన్ని పాక్ అనుకూల విధానాలు తీసుకున్నారో మనం చూశాము. మనం వారిది పాకిస్థాన్ జనతా పార్టీ లేక హిబ్బుల్ జనతా పార్టీ అని పిలవాలా? అని ప్రశ్నించారు.
మరాఠ్వాడ, విదర్భలో 19 మంది ఎంపీలు, శివసేన కార్యకర్తలు పాల్గొన్న పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘గతంలో వారు ఇస్లాంకు ముప్పు ఉందనే వాళ్లు కానీ నేడు హిందువులు ముప్పులో ఉన్నారంటున్నారు. భయాన్ని వ్యాపింపజేస్తున్నారు. శివసేన పార్టీని జనాబ్ సేన అంటున్నారు. మేము హిందుత్వను వీడనాడలేదు. అంతా గమనించిన ఎంఐఎం ఏ కారణం లేకుండానే ఎంవిఎలో చేరతానంది. ఇదో ట్రిక్. మేము ఎంఐఎంతో కలిసి వెల్లడమన్నది కల్ల’ అన్నారు.
పోలీసుల బదిలీ కేసులో మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై దర్యాప్తు జరపాలని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వారి సంభాషణలని పోలీసులు రికార్డు చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వారి ప్రకటనలని రికార్డు చేయడం వంటి వాటిపై బిజెపి నాయకులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. శాసన మండలికి ఎన్నికైన ఎంవిఎకు చెందిన 12 మంది నామినేషన్లను గవర్నర్ బిఎస్ కోశ్యారి ఆమోదించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.