ముంబై: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే తాజాగా చేసిన వ్యాఖ్య రాజకీయ చర్చకు దారితీసింది. శుక్రవారం ఔరంగాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బిజెపికి చెందిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి రావుసాహెబ్ దన్వేతో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ బిజెపి, శివసేన తిరిగి కలిస్తే ఇక్కడ ఉన్న నా మాజీ స్నేహితుడు, భవిష్యత్ స్నేహితుడు అవుతారు అని అన్నారు. దీంతో శివసేన తిరిగి బిజెపితో జతకట్టబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అనంతరం ఉద్ధవ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన పాత స్నేహితుడు రావుసాహెబ్ దన్వేను చాలా కాలం తర్వాత కలిసిన నేపథ్యంలో ఈ మేరకు జోక్ చేసినట్లు చెప్పారు.
మరోవైపు మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై స్పందించారు. ఇరు పార్టీల కలయికపై మౌనం వహించాల్సిన అవసరం లేదన్నారు. ‘రాజకీయాల్లో, ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. ఉద్ధవ్ జీ మా ‘మన్ కీ బాత్’ గురించి మాట్లాడారు. ఇది వినడానికి చాలా ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ నేత నానా పటోలే దీనిపై మరోలా స్పందించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ కొన్నిసార్లు జోక్ వేయడానికి ఇష్టపడతారు, ఇప్పుడు ఆయన అదే చేశారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిని పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.