కోష్యారీని ఇంటికి పంపిస్తారా..జైలుకా
మరాఠీ ప్రజలంటే అంత చిన్నచూపా?
మహారాష్ట్ర గవర్నర్‌పై ఉద్ధవ్ థాక్రే ధ్వజం
కోష్యారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
మరాఠీలను అవమానించారంటూ అన్ని పార్టీల ఆగ్రహం
ఆ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు: సిఎం షిండే
ముంబై: గుజరాతీలు, రాజస్తానీలు వీడితే ముంబై వద్ద డబ్బు ఉండదంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా పెనుదుమారాన్ని రేపాయి. గవర్నర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించబోనని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించగా గవర్నర్ కోష్యారీ క్షమాపణ చెప్పాలంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే శనివారం డిమాండు చేశారు. కోష్యారీని వెనక్కి పంపడమో లేక జైలుకు పంపడమో తేల్చుకోవలసిన సమయం వచ్చిందంటూ థాక్రే వ్యాఖ్యానించారు. ముంబై, థాణెలో ప్రశాంతంగా జీవిస్తున్న హిందువులను గవర్నర్ కోష్యారీ చీలుస్తున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం రాత్రి ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కోష్యారీ మాట్లాడుతూ ముంబై వదిలిపోవాలని గుజరాతీలు, రాజస్తానీలను అడిగినట్లయితే ముంబైలో ఇక డబ్బు ఏమీ మిగలదని, దేశ ఆర్థిక రాజధానిగా కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు.
కాగా..తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో గవర్నర్ కోష్యారీ శనివారం వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మరాఠీ మాట్లాడే ప్రజల శ్రమశక్తిని కించపరచడం తన ఉద్దేశం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఉండగా..తన నివాసం మాతోశ్రీలో థాక్రే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మరాఠీ ప్రజలంటే తన మనసులో ఉన్న ద్వేషభావాన్ని గవర్నర్ యాదృచ్ఛికంగా వెళ్లగక్కారని అన్నారు. మరాఠీ ప్రజలకు కోష్యారీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యతను కోష్యారీ విస్మరించారని, హిందువులలో చీలికలు తెచ్చేందుకు కూడా ఆయన ప్రయత్నించారని థాక్రే ఆరోపించారు.
అవి కోష్యారీ వ్యక్తిగత అభిప్రాయాలు: షిండే
ముంబై నగరంపై గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖలతో తాను ఏకీభవించడం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. శనివారం మాలేగావ్‌లో విలేకరులతో మాట్లాడుతూ అవి ఆయన(గవర్నర్) వ్యక్తిగత అభిప్రాయాలని, ఇప్పటికే ఆయన వివరణ కూడా ఇచ్చారని షిండే చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నుంచి వచ్చే మాటలు, చేతలు ఇతరులను అవమానించేరీతిలో ఉండకూడదని షిండే అన్నారు. ముంబై నగర పురోభివృద్ధిలో మరాఠీ ప్రజల శ్రమశక్తి ఎంతో ఉందని, ముంబైని, మరాఠీ ప్రజలను ఎవరూ అవమానించకూడదని ఆయన చెప్పారు.
ఏకీభవించబోము: ఫడ్నవీస్
మహారాష్ట్ర అభివృద్ధి వెనుక మరాఠీ మాట్లాడే ప్రజల కృషి ఎంతో ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ధూలేలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో కూడా మరాఠీ ప్రజలు ప్రపంచ స్థాయికి చేరుకున్నారని, గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని అన్నారు.
అనవసర వివాదాలు: అజిత్ పవార్
గవర్నర్ కోష్యారీ అనవసర వివాదాలు సృష్టించడం తగదని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఎన్‌సిపి నేత అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ముంబై రాజధానిగా మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటులో మరాఠీ ప్రజలు కీలక భూమిక పోషించారని, మహారాష్ట్ర లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఇలా ఉండగా..మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నానా పటోలె, రాష్ట్ర ఎన్‌సిపి అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా గవర్నర్ కోష్యారీ వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుపట్టారు. కాగా..శివసేన ఎంపి సంజయ్ రౌత్ సైతం గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మరాఠీ ప్రజలను, మహారాష్ట్రను బిచ్చగాళ్లుగా గవర్నర్ పరిగణిస్తున్నారని రౌత్ విమర్శించారు. మహారాష్ట్ర చరిత తెలియకుండా అటువంటి వ్యాఖ్యలు గవర్నర్ చేయకూడదంటూ ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ థాక్రే సూచించారు.