న్యూఢిల్లీ : శివసేన లో చీలిక జరిగిన తర్వాత నుంచి ఆ పార్టీపై హక్కుల కోసం మాజీ సిఎం ఉద్ధవ్ థాక్రే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య నెలకొన్న పోరులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. థాక్రే వర్గానికి సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభించింది. తమ పార్టీనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ షిండే వర్గం చేసిన వినతిపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇక మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దాఖలైన పలు పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అన్న దానిపై వచ్చే సోమవారం నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం వెల్లడించింది. అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ , ఎన్నికల గుర్తు ‘ విల్లుబాణం ’ తమకే కేటాయించాలని కోరింది.
అయితే దీన్ని థాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్‌ఎల్‌ఎల అనర్హత , పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున షిండే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని ఠాక్రే వర్గం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యం లోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక నిర్ణయం తీసుకొంది. దీంతో విల్లంబుల గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలను ఆగస్టు 8 నాటికి సమర్పించాలని షిండే, ఉద్ధవ్ వర్గాలకు ఈసీ సూచించింది. శివసేన శాసనసభా పక్షంతోపాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండు వర్గాలను కోరింది.దీంతో థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్‌ఎల్‌ఎల అనర్హత వ్యవహారం ఇంకా తేలలేదు కనుక, షిండే వర్గం పెట్టుకున్న అర్జీపై ఈసీ చర్యలు తీసుకోకుండా నివారించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం , ప్రస్తుతానికి షిండే వర్గం చేసిన వినతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈసీకి స్పష్టం చేసింది.