Wednesday, January 22, 2025

‘వర్ష’ను మాత్రమే వదిలేశా.. పోరాటాన్ని కాదు

- Advertisement -
- Advertisement -

సిఎం అవుతానని ఎప్పుడూ అనుకోలేదు
‘వర్ష’ను మాత్రమే వదిలేశా.. పోరాటాన్ని కాదు
షిండేకు ఎంతో చేశా.. అయినా ద్రోహం చేశారు
నా ఆరోగ్యం బాగా లేనప్పుడు కుట్రకు తెరదీశారు
శివసేన, థాక్రే పేరు ఎత్తకుండా వారు ముందుకెళ్లగలరా?
పార్టీ జిల్లా నేతలతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే
ముంబయి: శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఎంఎల్‌ఎల సంఖ్య 50కి పెరిగిందన్న వార్తల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకునే ప్రయత్నాలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రారంభించారు. ఈ క్రమంలోనే శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. వారు పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అసమ్మతి నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కుట్రకు తెరదీశారన్నారు. అలాగే వెళ్లిపోయిన వారి గురించి తానెందుకు బాధపడతానన్నారు. శివసేన, బాల్ థాక్రే పేరు వాడకుండా వారెలా ముందుకెళ్తారని ప్రశ్నించారు. అలాగే తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి కోసం కలగనలేదన్నారు. ‘శివసేనను విడిచిపెట్ట్టడంకంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారు. వారు పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారిగురించి నేనెందుకు బాధపడతా. శివసేన, థాక్రే పేరు వాడకుండా వారెంత దూరం వెళ్లగలరు? విశ్వాసపాత్రులమని చెప్పి కొందరు నమ్మక ద్రోహం చేశారని, ప్రజలే వారికి బుద్ధి చెబుతార’ని అన్నారు. ప్రస్తుతం తనపై అనేక ఆరోపణలు చేస్తున్న ఏక్‌నాథ్ షిండే కోసం అన్నీ చేశానని థాక్రే అన్నారు. ‘ఏక్‌నాథ్ షిండే కుమారుడు ప్రస్తుతం శివసేన ఎంపి. నేను అతని కోసం అన్నీ చేశా. నాకు ఉన్న శాఖను కూడా షిండేకు కేటాయించా. అయినప్పటికీ ఏం ఆశించి షిండే నాపై అనేక ఆరోపణలు చేస్తున్నాడో అర్థం కావడం లేదు’ అని అన్నారు. బాలాసాహెబ్ తనను ప్రేమించినదానికన్నా శివసేనను ఎక్కువగా ప్రేమించారన్నారు.
మనసు విప్పి మాట్లాడుతున్నా..
‘మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా మహమ్మారి దేశంలో అడుగుపెట్టింది. దానిని తట్టుకుని ఎలాగో ముందుకు వెళ్తుంటే నాకు మెడనొప్పి ప్రారంభమైంది. కొందరు నేను ఇక కోలుకోలేనని అనుకుంటున్నారు. అయినా నేను నా గురించి ఆలోచించుకోవడం లేదు. ఈ రోజు నేను మనసు విప్పి మాట్లాడుతున్నా.. నేను వర్ష( అధికార నివాసం) వదిలివచ్చా.అంటే నేను పోరాటాన్ని వదిలిపెట్టినట్లు కాదు. పదవులపట్ల వ్యామోహం కలిగిన వ్యక్తిని కాదు. నేను ముఖ్యమంత్రిని అవుతానని ఏ నాడు ఊహించలేదు’ అని ఉద్ధవ్ చెప్పారు. తాను అందుబాటులో ఉండడం లేన్న రెబెల్ ఎంఎల్‌ఎల ఆరోపణలను ప్రస్తావిస్తూ, అనారోగ్యం కారణంగానే తానుప్రజలను కలుసుకోలేకపోయానని చెప్పారు.‘నా తల, మెడ, పాదాల వరకు మొత్తం నొప్పిగా ఉంది. కళ్లు కూడా సరిగా తెరవలేక పోతున్నా’ అని ముఖ్యమంత్రి అన్నారు. కాగా, శివసేన భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య థాక్రే కూడా పాల్గొన్నారు.‘ మిత్రపక్షాలు వెన్నుపోటు పొడిచినా ఇంత బాధ ఉండేది కాదని మా అమ్మ వాపోయింది. మనవల్ల ఎదిగిన మనవాళ్లు మనకు వెన్నుపోటు పొడిచారు. దానికి ఎంతగానో బాధగా ఉంది. నాన్న అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని వారు లబ్ధి పొందారు’ అంటూ అసమ్మతి నేతలపై ఆదిత్య థాక్రే మండిపడ్డారు.
మరో ఎంఎల్‌ఎ చేరిక
అసోంలోని గౌహతి హోటల్‌నుంచే ఏక్‌నాథ్ షిండే తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వద్ద దాదాపు 40 మంది శివసేన ఎంఎల్‌ఎలున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మరో సేన ఎంఎల్‌ఎ ఆయన శిబిరంలో చేరిపోయారు. ముంబయిలోని చందీవలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలీప్ లాండే గౌహతిలో తిరుగుబాటు ఎంఎల్‌ఎలు బస చేసిన హోటల్‌లోకి ప్రవేశిస్తున్న వీడియోను ముంబయిలోని షిండే కార్యాలయం విడుదల చేసింది. మరో 12మంది స్వతంత్ర ఎంఎల్‌ఎలు కూడా ఆయనతో ఉన్నట్లు చెబుతున్నారు.

Uddhav Thackeray meeting with Shiv Sena leaders

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News