ముంబై : ఆల్ ఇండియా మజ్లిస్ ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (మజ్లిస్) పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని శివసేన చీఫ్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. ఆ ఎంఐఎంను బీజేపీ బి టీమ్‌గా ఆయన పేర్కొన్నారు. పొత్తుకు పిలుపు అంటే మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న శివసేనకు ఉన్న హిందుత్వ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి విపక్షం బిజెపి చేస్తున్న కుట్ర అని విమర్శించారు. శివసేన ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉద్ధవ్ ఆదివారం మాట్లాడారు. ముంబై లోని శివసేన భవన్‌లో ఈ సమావేశం జరిగింది. సంజయ్ రౌత్ , వినాయక్ రౌత్, ఏక్‌నాధ్ షిండే తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ మాట్లాడుతూఏ బీజేపీకి టీమ్ బీగా ఉన్న ఎంఐఎం చేసిన పొత్తు ప్రతిపాదనను తమ పార్టీ ఎంతమాత్రం అంగీకరించేది లేదని తెలిపారు. శివసేనకు ఉన్న హిందుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే ఎంఐఎం ద్వారా శివసేన, మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను బీజేపీ ఉద్దేశ పూర్వకంగా చేయించిందని ఆరోపించారు. ఈ విషయమై ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి మార్చి 22న విదర్భ, మరట్వాడా రీజియన్ల లోని మొత్తం 19 జిల్లాల్లో శివ సంపర్క్ మొహిమ్ అనే ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాన్ని శివసేన నిర్వహిస్తుందని చెప్పారు.