Thursday, January 23, 2025

మోడీ తొత్తుగా మారిన ఎన్నికల సంఘం..

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై ఎన్నికలకు సిద్ధం కావాలని, దొంగకు తేలుకుట్టేలా చేయాలని మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే కార్యకర్తలు, మద్దతుదార్లకు పిలుపు నిచ్చారు. ఎన్నికల సంఘం ప్రధాని మోడీకి తొత్తు అయిందని విమర్శించారు. ఏక్‌నాథ్ షిండేదే శివసేన అని, ఈ వర్గానికే శివసేన గుర్తు విల్లు బాణం దక్కుతుందని ఒక్కరోజు క్రితం ఎన్నికల సంఘం గుర్తింపు వెలువరించిన నేపథ్యంలో థాకరే ఇక్కడి తమ నివాసం మాతోశ్రీ ఆవరణలో కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు. పార్టీ గుర్తును తస్కరించుకువెళ్లిన దొంగకు తగు గుణపాఠం చెప్పాల్సి ఉందని ఉద్ధవ్ ఈ సందర్భంగా షిండేపై మండిపడ్డారు. ఓ దొంగ చేసిన పనికి చింతిస్తూ కూర్చుంటే లాభం లేదని, ఇక మనమంతా త్వరలోనే జరిగే ముంబై మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత ఎప్పుడు జరిగినా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని, వంచనకు పాల్పడ్డ వారు, తేనెతెట్టె కదిల్చిన వారు ఓటుకాటుకు కంగుతినాలని బంద్రాలోని తమ నివాసం వెలుపల ఆయన ఓ ఓపెన్ కారులో నిలబడి ప్రసంగిస్తూ చెప్పారు.

దివంగత బాల్‌థాకరే 1966లో శివసేనను స్థాపించారు. పలు పరిణామాల నడుమ ఎన్నికల సంఘం షిండే వర్గానిదే నిజమైన శివసేన అని పేర్కొంటూ, ఈ వర్గానికే ఎన్నికల గుర్తు వర్తిస్తుందని తెలిపింది. త్వరలో జరుగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే శివసేన సెంటిమెంట్ పేరు, గుర్తులను థాకరే కోల్పోవల్సి వచ్చింది. ప్రధాని మోడీ, బిజెపి ఎంతకు బరితెగించినా చివరికి రాష్ట్రంలోని అధికార యంత్రాంగం బిజెపికి తొత్తుగా మారినా శివసేనను దెబ్బతీయడం వారి తరం కాదని ఉద్ధవ్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఉద్ధేశించి మీరు భయపడుతున్నారా? ఈ దశలో మీకు తాను ఇచ్చేందుకు ఏదీ లేదని అయితే ఆత్మస్థయిర్యం సందేశం వెలువరిస్తున్నానని థాకరే తెలిపారు. ఈ దశలో కార్యకర్తలు తాము జంకే ప్రసక్తే లేదని, తరువాతి చర్యకు ఆదేశిస్తే ముందుకు సాగుతామని నినదిస్తూ తెలిపారు.

శివరాత్రి నేపథ్యంలో తన నివాసం వద్ద గుమికూడిన కార్యకర్తలతో థాకరే ఇక జాగుచేయకండి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని పిలుపు నిచ్చారు. శివసేన గుర్తును షిండేలు మోయలేరని, వారు శివధనుస్సును ఎత్తలేక బోర్లా పడ్డ రావణుడి పరిస్థితి తప్పదని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. దొంగలు తెనెతెట్టేపై రాయి విసిరారని, తేనే ఎత్తుకువెళ్లారని, అయితే తేనెటీగలు ఊరుకుంటాయా? కుట్టి పడేస్తాయని తెలిపారు. ఎన్నికల గుర్తుల వివాదాలు వచ్చినప్పుడు ఇంతకు ముందటి వరకూ వాటిని స్తంభింపచేయడం జరిగేదని, అయితే ప్రధాని మోడీ తొత్తులు అరాచకంగా వ్యవహరించారని థాకరే నేరుగా ప్రధాని వైఖరిపై మండిపడ్డారు. శివసేన ఎవరిది అనేది ప్రజలు నిర్ణయిస్తారని, ఎవరికో ఒక్కరికి తొత్తులు కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ముసుగుదొంగలు ఎవరు? అసలు వ్యక్తులు ఎవరనేది తెలుసునని చెప్పిన ఉద్ధవ్ థాకరే బలీయమైన ప్రజాభిమానంతో ఉన్న ప్రత్యర్థిని ఎదుర్కొంటామని, కార్యకర్తలు కలిసిరావాలని కోరారు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News