ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. ఇది ఎవరి ఒత్తిడితోనో కాకుండా సంకుచిత తత్వం లేకుండా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో పార్టీ సమావేశం జరిగిన తరువాత ఈ ప్రకటన విడుదల చేశారు. శివసేన ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. 18మంది శివసేన ఎంపీలకు గాను 13మంది ఎంపీలే సోమవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. గతంలో కూడా తాము రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో స్వతంత్రం గానే నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు కూడా అలాగే జరిగిందని థాక్రే పేర్కొన్నారు. కొంతమంది గిరిజన నేతలు, తమ పార్టీ శాసన సభ్యులు తనను కలిసి ముర్ముకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారని థాక్రే చెప్పారు. వాస్తవానికి ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆమెకు తాము మద్దతు ఇవ్వకూడదని, కానీ తాము సంకుచిత తత్వంతో లేమని చెప్పారు.
Uddhav Thackeray Support to Draupadi Murmu