న్యూస్‌డెస్క్: దొంగను దొంగ అనడం మన దేశంలో నేరంగా మారిపోయిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. దొంగలు, దోపిడీదారులు స్వేచ్ఛగా తిరుగుతుంటే రాహుల్ గాంధీని శిక్షించారని శుక్రవారం ఒక ట్వీట్‌లో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. ఇది నేరుగా ప్రజాస్వాహ్యాన్ని హత్య చేయడమేనంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఒత్తిళ్లలో పనిచేస్తున్నాయని, ఈ నియంతృత్వ పాలన అంతానికి ఇది ఆరంభమంటూ ఆయన పేర్కన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సమైక్యంగా కలసిరావలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన చెప్పారు.
మోడీ ఇంటిపేరుపై 2019లో చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బిజెపి కార్యకర్త ఒకరు దాఖలు చేసిన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని శుక్రవారం రద్దు చేసిన దరిమిలా ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.