తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివరణ
చెన్నై: అయోధ్యలో రామాలయానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కాని మసీదును కూల్చివేసి ఆలయాన్ని నిర్మించడాన్నే తమ పార్టీ వ్యతిరేకిస్తోందని డిఎంకె నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏదో ఒక మతానికి లేదా విశ్వాసానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని డిఎంకె వ్యస్థాపకులలో ఒకరైన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి చెప్పిన విషాయన్ని ఉదయనిధి గుర్తు చేశారు.
అక్కడ ఆలయ నిర్మాణం పట్ల తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే మసీదును ధ్వంసం చేసిన చోటే ఆలయాన్ని నిర్మించడం పట్ల తమకు అభ్యంతరం ఉందని 1992లో జరగిన బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఆధ్మాత్మికవాదాన్ని, రాజకీయాలను కలపకూడదని తమ పార్టీ కోశాధికారి టిఆర్ బాలు ఇదివరకే ప్రకటించారని ఆయన చెప్పారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు సాగిస్తున్న పోరాటాన్ని గురించి విలేకరులు ప్రశ్నించగా నీట్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా 50 లక్షల సంతకాలే లక్ష్యంగా ఉద్యమాన్ని చేపట్టగా దాదాపు 85 లక్షల సంతకాలు అందాయని ఉదయనిధి తెలిపారు.
సేలంలో ఈనెల 21న జరగనున్న పార్టీ యువజన విభాగం సమావేశంలో ఈ సంతకాలను ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌తోపాటు పోస్టు ద్వారా అందిన ఈ సంతకాలను ఆ తర్వాత న్యూఢిల్లీలో రాష్ట్రపతికి అందచేయడం జరుగుతుందని ఆయన వివరించారు. సేలంలో జరిగే యువజన విభాగం సమావేశాలనికి 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.