Sunday, January 5, 2025

సనాతన ధర్మం – సమానత్వం

- Advertisement -
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు, స్వయానా మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కలరా, మలేరియా లాంటి వ్యాధులతో పోల్చి దాన్ని నిర్మూలించాలని, దాని స్థానం లో రాజ్యాంగ విలువైన సమానత్వాన్ని స్థాపించాలని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్నది సనాతన ధర్మాన్ని, హిందుత్వ భావజాలాన్ని సమాజంలో నెలకొల్పాలని తీవ్రంగా కృషి చేస్తూ వున్నటువంటి ఆర్‌ఎస్‌ఎస్ దాని రాజకీయ విభాగం అయిన బిజెపి, కనుక సహజంగానే ఈ వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అరిషడ్వర్గాలకు దూరంగా ఉంటూ శాంతిని, సాత్విక భావాన్ని ప్రచారం చేయవలసిన సాధువు పుంగవులు సైతం ఒక అడుగు ముందుకే వేసి ఉదయనిధి స్టాలిన్ తల నరికి తీసుకువస్తే వారికి కోట్ల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. బిజెపి పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి మొదలుకుంటే గల్లీ స్థాయి నాయకుల వరకు ఉదయనిధిని నరికేస్తామని, చంపేస్తామని, ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాయని తీవ్రంగా మండిపడుతున్నారు.

కానీ మణిపూర్‌లో ఇద్దరు స్త్రీలను మానవత్వం సిగ్గుపడేలా, ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునేలా, నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన సంఘటన పట్ల ఈ నాయకులంతా, దేశ ప్రధానితో సహా కొన్ని నెలల పాటు మౌనం వహించారు. ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఒక వ్యక్తి అనగానే వీరంతా ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే మణిపూర్‌లో ఇంత క్రూరమైన సంఘటన జరిగినప్పుడు మాత్రం వీరి నోళ్లు ఎందుకు మూగబోయాయి? మనుషుల ప్రాణాల కన్నా, స్త్రీలపై జరిగిన అత్యాచారాల కన్నా వీరికి సనాతన ధర్మమే ఎందుకు ముఖ్యమైనదయ్యింది. ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మానికి రాజ్యాంగ విలువలైన సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ఉన్న తేడా ఏమిటి? ఈ రెంటికి వైరుధ్యం ఉన్నదా? ఇంతకీ ఈ సనాతన వాదులు సనాతన ధర్మానికి సంబంధించి చెబుతున్నది ఏమిటో, కొంత పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

సనాతనం అంటే శాశ్వతమైన, మార్పులేని, నిత్యమైన అన్న అర్థాలు సంస్కృత భాషతో పరిచయం ఉన్న ఎవరైనా తెలుసుకోగలరు. సనాతన ధర్మం అంటే నిత్యమైన, ఎప్పుడు మారని, శాశ్వతమైన జీవిత విధానం అని అర్థం చెప్పుకోవచ్చు. అయితే శాశ్వతమైనది ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది సనాతన ధర్మమే అని హిందూత్వవాదులు లేదా సనాతనవాదులు అంటూ వున్నప్పటికీ వారు నమ్మిన ఈ సనాతన ధర్మమే నిరంతరం మార్పు చెందుతూ వస్తూ వున్నది అన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు. నిజానికి శాశ్వతమైనది ఏదైనా ఉన్నది అంటే, అది కేవలం ‘మార్పు’ మాత్రమే. మారనిది అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇకపోతే సనాతన ధర్మానికి ఆలంబన అయినటువంటి తాత్వికత ఎక్కడి నుంచి వస్తున్నది. ఈ సనాతన ధర్మానికి ఆధారభూతాలైన గ్రంథాలు ఏమిటి? ఏ గ్రంథాల ఆధారంగా మనం సనాతన ధర్మాన్ని నిర్వచించుకోవచ్చు? అన్న ప్రశ్నలకు ‘వేదాలే ప్రమాణం’ అన్న సమాధానానికి మనం సులువుగానే చేరుకోవచ్చు. ప్రాపంచిక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం, ఆదర్శవంతమైన జీవన విధానాన్ని ఎంచుకోవడం కోసం, సాధారణ మానవులు ప్రయత్నం చేసినప్పుడు వారికి మార్గదర్శనం చేయగలిగే గ్రంథాలు వేదాలేనని ఈ హిందూత్వ లేదా సనాతనవాదులు ఘంటాపథంగా చెబుతారు.

క్రీస్తుపూర్వం 6 శతాబ్దంలో పురుడుపోసుకున్న బౌద్ధం ఈ వర్ణ వ్యవస్థను నిరసిస్తూ మానవుల మధ్య సమానత్వాన్ని సహోదరత్వాన్ని ప్రతిపాదించింది. దాని ప్రభావం సుమారు 700 సంవత్సరాల పాటు కొనసాగిన తరువాత తిరిగి ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు, వైదిక ధర్మానికి లేదా సనాతన ధర్మానికి పూర్వ వైభవం కల్పించింది ఆదిశంకరాచార్యులు. బౌద్ధం ప్రభావం వల్ల బలహీనపడ్డ వర్ణ వ్యవస్థను తిరిగి పునర్జీవింప చేసి మనుషుల మధ్య అంతరాలను తిరిగి బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. చరిత్రలో దీనికి రుజువు కూడా ఉన్నది. చంద్రగుప్తుని కాలం లో బౌద్ధం తాత్విక దృక్పథాన్ని, బుద్ధుని బోధనలను అధ్యయనం చేయటానికి చైనా నుంచి వచ్చిన ఫాహియాన్ బౌద్ధం ఎంత విస్తృతంగా జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిందో, ప్రజలపై బుద్ధుని సమానత్వ సిద్ధాంత ప్రభావం ఏరకంగా వేళ్ళూనుకొని పోయిందో ఆయన, తన రచనల్లో వివరించారు.ఆ తరువాత క్రీస్తు శకం ఏడవ శతాబ్దం అంటే సుమారు 1000 సంవత్సరాల తర్వాత వచ్చిన హూయన్ సాంగ్ అనే మరో చైనా యాత్రికుని రచనలు బౌద్ధం ఎలా క్షీణించిందో, బ్రాహ్మణవాదం, వైదిక ధర్మం తిరిగి ఎలా పుంజుకున్నదో, ప్రజలు తిరిగి కుల అంతరాల్లోకి ఎలా నెట్టి వేయబడ్డారో కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు.

అయితే ఈ 1000 సంవత్సరాల్లో జరిగింది ఏమిటి?
వెయ్యి సంవత్సరాల పాటు ప్రజలందరి మధ్య సమానత్వాన్ని సాధించిన, పేద, ధనిక అగ్రవర్ణ, నిమ్నవర్ణ భేదాలు లేకుండా ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన మతం ఒక 1,000 సంవత్సరాల్లో ఎంత సాహిత్యాన్ని సృష్టించగలదో మనం ఊహించవచ్చు. ప్రపంచం అబ్బురపడే తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలను బౌద్ధమే సృష్టించింది. అక్కడ ఉన్న గ్రంథాలయాలే సుమారు పది అంతస్తుల మేడల్లో కొనసాగేవని మనకు చైనా నుంచి వచ్చిన యాత్రికులైన పాహియాన్, హుయాన్ సాంగ్ రచనల ద్వారా తెలుస్తోంది. అయితే బౌద్ధం సాధించిన ఈ ప్రగతిని చదువుకోటానికి కానీ, తెలుసుకోవటానికి కానీ ఒక్క గ్రంథం మిగలలేదంటే దీని వెనక ఏ ధర్మం కుట్ర ఉన్నదో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. బౌద్ధం ఈ దేశంలో విలసిల్లినంత కాలం అందరికీ చదువుకునే అవకాశం, అందరికీ సమానమైన హక్కులు లభించిన ఈ దేశంలో తిరిగి ఆదిశంకరాచార్యుల ప్రభావం తర్వాత మాధవాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారి వల్ల వర్ణ వ్యవస్థ తిరిగి బలంగా పాదుకొనిపోయి, ఈ దేశపు మెజారిటీ ప్రజానీకం తీవ్రమైన పీడనకు, బానిసత్వానికి గురయ్యారు. ఈ వర్ణ వ్యవస్థ మెజారిటీ ప్రజలను బానిసలుగా మార్చటానికి ఉపయోగపడిందే తప్ప సమానత్వాన్ని సాధించడానికి గాని, సమానమైన అవకాశాలను కల్పించడానికి కానీ ఉపయోగపడలేదు. అయినా నేడు ఈ హిందుత్వవాదులు సనాతన ధర్మమే ఉన్నతమైనదని, అది శాశ్వతమైనదని మానవాళి జీవించడానికి అత్యున్నతమైన జీవిత విధానాన్ని సమకూర్చేది సనాతన ధర్మమే అని నిస్సిగ్గుగా నమ్మబలుకుతున్నారు.

ఒకవేళ ఈ సనాతన ధర్మమే ఉన్నతమైనది అయితే మరి మన దేశంలో నాలుగు వేలకు పైగా కులాలు ఎవరు సృష్టించారు. హెచ్చుతగ్గులను సృష్టించింది ఎవరు? వర్ణాలు పక్కన పెట్టండి ఒక వర్ణంలోని వివిధ కులాల మధ్య కూడా వైవాహిక సంబంధాలను నిషేధించింది, కనీసం ఒక్క బంతిలో కూర్చొని భోజనం చేసే అవకాశాలను సైతం లేకుండా చేసి మనుషులను ఇంతగా చీల్చింది ఏ ధర్మం? స్త్రీల అభిమానాన్ని కూడా దాచుకోకుండా, వారికి కనీసం తమ మానరక్షణ చేసుకునే అవకాశాలను సైతం నిషేధించి రొమ్ము పన్నులు వేసింది ఏ ధర్మం?ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనుషులలో అస్పృశ్యులను సృష్టించింది ఈ ధర్మమే కదా. ధర్మరక్షణ పేరుతో సతీసహగమనాన్ని ప్రోత్సహించింది, వందల సంవత్సరాల పాటు కిరాతకంగా అమలు చేసింది, 4 సెప్టెంబర్ 1987లో సతీసహగమనం పేరు మీద కేవలం 18 సంవత్సరాల రూప్ కన్వర్ అనే క్షత్రియ స్త్రీని బలవంతంగా సజీవ దహనం చేసింది ఈ సనాతన ధర్మం కాదా? ఈ హిందూత్వ, ఈ సనాతన ధర్మవాదులే కదా దానిని సమర్ధించి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగటానికి కారణమయింది నిజం కాదా?గత పదేళ్ల పాలన అగ్ర వర్ణాల్లోని పేదలకు ఎంత మేలు చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ, సంస్థలన్నింటినీ విచ్చలవిడిగా తెగ నమ్మి, చేతి వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే కొద్ది మందికి ఆ ఆస్తులు అన్నింటిని దోచిపెట్టి,

ఈదేశపు యువతరానికి ఉపాధి అవకాశాలను, భద్రతతో కూడిన భవిష్యత్తును లేకుండా చేసి ఈ సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం ఘనత వహించింది. రిజర్వేషన్లు అమలయ్యే ప్రభుత్వ సంస్థలన్నింటినీ యథేచ్ఛగా అమ్మివేయటమో, ప్రైవేటీకరించటమో చేసి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మోసం చేసిన ఘనత ఈ సనాతన ధర్మవాదులదే. శూద్రులలోని అగ్ర కులస్థులను, అగ్ర వర్ణాలవారు శూద్రులని అవమానిస్తూనే, ఆ విషయమే అర్థం కానివ్వకుండా అదే శూద్ర అగ్రకులాలను రిజర్వేషన్ల బూచి చూపి తమ శూద్రవర్ణంలోని ప్రజలకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్న ధర్మమే సనాతన ధర్మం. సనాతన ధర్మవాదుల పరిపాలన ఎలా ఉండగలదో కర్ణాటకలోనూ, మణిపూర్‌లోనూ, హర్యానాలోను జరిగిన మత ఘర్షణలే అద్దం పడుతున్నాయి. తమ మత విశ్వాసాలకు వ్యతిరేకమైన అభిప్రాయాలు వెలిబుచ్చిన వారిని చంపి వేస్తామంటూ ఫత్వాలు జారీ చేసే తాలిబన్లకు, ఉదయనిధి స్టాలిన్‌ను చంపివేస్తామని, చంపివేసిన వారికి కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని, ప్రకటిస్తున్న సనాతన వాదులకు మధ్య తేడా లేదని కూడా మనం గమనించాలి.

పదేళ్ల సనాతనవాదుల పరిపాలన తరువాతైనా ఈ దేశపు మెజారిటీ ప్రజలైన బహుజనులు తమకు సనాతన ధర్మం కావాలో లేక రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ విలువలు కావాలో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలకు సనాతన ధర్మాన్ని, హిందుత్వవాదులను తిరస్కరించాల్సిన సమయం, లౌకిక, ప్రజాస్వామిక, సమానత్వ విలువలను ఎత్తిపట్టవలసిన సమయం మునుపటి కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంది. సనాతన వాదులపట్ల, హిందుత్వవాదుల పట్ల అలసత్వం వహిస్తే 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో మనం సాధించుకున్న ప్రజాస్వామిక, లౌకిక విలువలు ఎలా తుడిచిపెట్టుకుపోగలవో ఒక్కొక్కటిగా కూలిపోతున్న రాజ్యాంగ వ్యవస్థలే నిదర్శనం. రాజ్యాంగం ఏర్పరిచిన అనేక స్వతంత్ర సంస్థలు నిర్వీర్యం చెంది హిందుత్వవాదుల, సనాతనవాదుల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయి, భిన్నమైన అభిప్రాయాలను, భిన్నమైన రాజకీయ విశ్వాసాలను ఎలా అణచివేయగలవో మనం చూస్తున్నాం. మేల్కొనకపోతే మనకు రానున్నవి చీకటి రోజులే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News