చెన్నై : మూఢ నమ్మకాల ఆయువుపట్టు అయిన సనాతన ఆచారాల మేరకే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవలేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. సనాతన ధర్మంపై తన దాడిని తిరిగి ఆయన గురువారం పదునైన మాటలతో ఆరంభించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. దీనికి ప్రధాని మోడీ ప్రత్యేకించి పలువురు హిందీ నటులను పిలిపించారు. మరి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదు.
ఆమె వితంతువు పైగా ఆదివాసీ అయినందున అపశకునం అని భావించి ఆమెను రమ్మనలేదా? అని ప్రశ్నించారు. ఈ అన్యాయం కేవలం సనాతన వాదం వల్లనే జరిగిందన్నారు. వితంతువులను, అంటరాని వారనుకునే ఆదివాసీలను శుభకార్యక్రమాలకు పిలవకపోవడమే సనాతన ధర్మం అనుకోవాలా? అని విమర్శకులపై ఎదురుదాడికి దిగారు. సనాతన ధర్మం దేశానికి పట్టిన తెగులు, డెంగ్యూ, మలేరియా, చివరకు కరోనా వంటిదని ఇటీవలే స్టాలిన్ చెప్పడం వివాదానికి దారితీసింది. హిందూ సంస్థల నుంచి ఆయనపై ఎదురు దాడికి దారితీసింది.